బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. మరొకరిని అధ్యక్షుడి నియమిస్తారని పెద్ద ఎత్తున చర్చ
Bandi Sanjay: కొద్ది రోజులుగా సైలెంట్ అయిన బీజేపీ కీలక నేతలు
బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. మరొకరిని అధ్యక్షుడి నియమిస్తారని పెద్ద ఎత్తున చర్చ
Bandi Sanjay: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో సంక్షోభం ముదురుతోంది. బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీకి కొత్త ఊపు వచ్చిందని అంతా భావించారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఎన్నికలు సైతం తెలంగాణలో బీజేపీ కేడర్‌కు కొత్త బూస్టును ఇచ్చాయి. అయితే బీజేపీలోని మరో వర్గం మాత్రం బండి నాయకత్వాన్ని వ్యతిరేకించినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయినా ఎక్కడా బయటపడకుండా పార్టీ బలం పెంచేందుకు నాయకులంతా కలిసి పనిచేశారు. కాని రాష్ట్ర నాయకత్వంలో మార్పలు చేయాలని... తద్వారా ఎన్నికల ముందు పార్టీలో కొత్త జోష్ తీసుకురావాలని హైకమాండ్ నిర్ణయించినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు ఆ ప్రచారంతోనే బండి సంజయ్ డీలా పడినట్లు తెలుస్తోంది.
జాతీయ నాయకత్వం వైఖరి కారణంగా పార్టీ రాష్ట్ర సారథ్యమే గందరగోళంలో పడింది. అంతర్గత పోరు వీధినపడింది. సీనియర్ నేతలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. దాంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధినాయకత్వమే పార్టీ రాష్ట్ర సారథ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పించి, ఆయన స్థానంలో పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డికి అవకాశమివ్వాలని జాతీయ నాయకత్వం దాదాపు నిర్ణయం తీసుకుందని, అయితే ఈ బాధ్యతల పట్ల కిషన్‌రెడ్డి విముఖంగా ఉన్నారని ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రిగా వెళ్లేందుకు మొదటి నుంచీ విముఖంగా ఉన్న బండి సంజయ్ ప్రస్తుత పరిస్థితిలో తాను అధ్యక్షుడిగా కూడా కొనసాగలేనని పార్టీ జాతీయ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది.
దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చిన కొంత మంది కొత్త నేతలు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్, మాజీ మంత్రి డీకే అరుణల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సంజయ్‌ని మార్చొద్దు... తప్పనిసరైతే అవకాశం మాకివ్వండి... అని ఈటల, రాజగోపాల్ మినహా మిగతా నేతలు జాతీయ నాయకత్వాన్ని కోరినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
మరో వైపు తెలంగాణ బీజేపీ కీలకంగా ఉన్న నేతలు తమకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న ప్రచారమూ ఉంది. ఏమైందో ఏమో కాని కొద్ది రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైలెంట్ అయ్యారు. అసలు కెమెరాలకే చిక్కడం లేదు. రఘునందన్‌ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించాలని పార్టీ నాయకత్వానికి సూచిస్తూ జితేందర్‌రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి దున్నపోతును తన్నడంతో అది వాహనం ఎక్కిన వీడియోను ట్వీట్ చేస్తూ.. బీజేపీ నాయకత్వానికీ ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ రెండురోజుల కిందట జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ పార్టీలో దుమారం రేపిన వెంటనే మరో ట్వీట్‌తో జితేందర్ రెడ్డి చర్చకు తెరలేపారు.
ఇలా తెలంగాణ బీజేపీలోని కీలక నేతలు ప్రస్తుతం ఎవరి దారి వారిదే అన్న వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బండి అసంతృప్తిగా ఉండటం.. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడం వంటి పరిణామాలు పార్టీ భవిష్యత్తును సంక్షోభంలో పడేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే తెలంగాణలో అధికారం కాదు కదా... కనీసం అనుకున్న సీట్లు సైతం రావన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.