TGSRTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ - నోటీసు ఇచ్చిన జేఏసీ

Update: 2025-01-27 14:14 GMT

TGSRTC JAC issues strike notices: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ బస్ భవన్‌లో అధికారులను కలిసిన కార్మిక సంఘాల నాయకులు సమ్మె నోటీసులను అందించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీలు అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు తదితర డిమాండ్లను నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేదంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

నాలుగేళ్ల తర్వాత మరోసారి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు.. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయని జేఏసీ అసహనం వ్యక్తం చేసింది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది.

ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించకుండా, యూనియన్లను రద్దు చేసి, కార్మికులకు పనిగంటలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

Full View

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కార్మికులు సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Tags:    

Similar News