Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. మూడు రోజుల్లో నోటిఫికేషన్!
Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది.
Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. మూడు రోజుల్లో నోటిఫికేషన్!
Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క–సారలమ్మ సాక్షిగా ఆదివారం (జనవరి 18, 2026) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఈ మేరకు ఎన్నికల సంఘానికి అధికారికంగా లేఖ పంపినట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజన వంటి కీలక అంశాలకు కూడా ఆమోదం లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది.
రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, పార్టీ అగ్రనేతల చుట్టూ పైరవీలు జోరుగా సాగుతున్నాయి. గడువు ముగిసిన మున్సిపాలిటీల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
మొత్తంగా మరో మూడు రోజుల్లో అధికారిక ఎన్నికల షెడ్యూల్ వెలువడితే, తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయ సమరం మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.