పరిశ్రమల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి హరీష్‌ రావు సమీక్ష..హాజరైన అధికారులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను పునరుద్దరించుకోవచ్చని యాజమాన్యాలకు తెలిపింది.

Update: 2020-05-18 07:34 GMT
Harish Rao (File Photo)

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను పునరుద్దరించుకోవచ్చని యాజమాన్యాలకు తెలిపింది. దీంతో పరిశ్రమలను యాజమాన్యాలు తెరుస్తున్నాయి. కాగా పరిశ్రమలు ప్రారంభించేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు కలెక్టరేట్‌ కార్యాలయంలో పారిశ్రామిక యాజమాన్యాలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ కరోనా సోకకుండా జాగ్రత్తలు వహించకపోతే కార్మికుల మధ్య వైరస్‌ వేగంగా వైరస్ విస్తరిస్తుందన్నారు. ప్రతి పరిశ్రమలో కార్మికుల కోసం మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. జాగ్రత్తలు వహించకుండా పాత పద్థతిలో పరిశ్రమలు నడపుతామంటే కుదరదన్నారు.

కార్మికుల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా ఆ పరిశ్రమలో ప్రొడక్షన్‌ ఆగిపోతుందని, పరిశ్రమను మూయాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులను ప్రత్యేక బస్సుల్లో తరలించాలన్నారు. సీటుకు ఇద్దరే ఉండాలని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ షిప్టు పద్దతిలో కార్మికులతో పని చేయించాలని సూచించారు. పరిశ్రమలు చాలా రోజులు మూతపడటం వల్ల కెమికల్‌ రియాక్షన్‌ జరుగుతుందని తెలిపారు. వైజాగ్‌లో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం అలాగే జరిగిందన్నారు. ఈ సంఘటన తర్వాత అప్రమత్తంగా ఉండాలని ఆరోజే కలెక్టర్‌ ను ఆదేశించామన్నారు.

వైజాగ్‌ ఘటన తర్వాత సంగారెడ్డి పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయారన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు తప్పకుండా పాఠించాలని, కరోనా నేపథ్యంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం పని చేస్తుందని, పరిశ్రమ యాజమాన్యాలకు సమస్యలుంటే 08455-272525 నెంబరుకు ఫోన్‌ చేయండన్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ, పొల్యూషన్‌, బాయిలర్స్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News