Medaram Jatara: దారులన్నీ జాతరవైపే.. జనసంద్రంగా మేడారం !

Update: 2020-02-05 05:16 GMT

తెలంగాణా మహా కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఎనిమిదవ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. రెండేళ్ళకోమారు జరిగే ఈ జాతరకు ఈ దఫా కోటి మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఈ జాతరకు పేరుంది.

ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర ప్రారంభ వేడుకలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి ఎనిమిదో తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు మేడారం సకల సౌకర్యాలతో ముస్తాబైంది. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో వనదేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించటంతో జాతర మొదలవుతుంది. గిరిజనుల ఆరాధ్యదైవం పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సోమవారం బయల్దేరాడు. పగిడిద్దరాజు మూడురోజుల పాటు ప్రయాణించి, మేడారానికి ఈ రోజు రాత్రి 9 గంటల లోపు మేడారం గద్దెలకు చేరుకోవటంతో, జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది.

యాపలగడ్డ గ్రామానికి చెందిన ఆరెం వంశీయులైన గిరిజనులు పగిడిద్దరాజును గుడి నుంచి గద్దెపైకి చేర్చి పూజలు చేస్తారు. నేడు సారలమ్మ, రేపు సమ్మక్క మేడారం చేరుకొని గద్దెలపై ఆసీనులవుతారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మ మూడోరోజున భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆదివాసీ దేవతలను దర్శించుకుంటారు. వన దేవతలను తమ ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమలు, చీరె సారెలు కానుకలుగా పెడుతారు. కోరిన కోర్కెలు తీర్చిన వన దేవతలకు భక్తులు తమ ఎత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించుకుంటారు. దేశంలో అలహాబాద్‌ కుంభమేళా తర్వాత అంతస్థాయిలో లక్షలాది జనసందోహంతో జరిగే మేడారం జాతర దేశంలోనే విశిష్టమైనది.

రెండేండ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ రాష్ర్టాల నుంచి లక్షలాదిగా ఆదివాసులు తండోపతండాలుగా రోజుల తరబడి నడిచి మేడారం చేరుకుంటారు. ఎడ్లబండ్లు, కాలినడకన బారులుతీరి అడవి బాటలు, రహదారులన్నీ మేడారానికి జనప్రవాహమవుతాయి. కోటి నలభై లక్షలకుపైగా వస్తారనేది అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 75 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేయటంతో పాటు స్నానఘట్టాలు, సకల వసతులకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ దఫా జాతరను ప్లాస్టిక్‌రహిత జాతరగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News