TS News: కొత్త మద్యం విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
TS News: ఈనెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
TS News: కొత్త మద్యం విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
TS News: రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. గతంలో మాదిరిగానే 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2025 నవంబరు 30 వరకు రెండేళ్ల పాటు ఈ విధానం అమలులో ఉండనుంది. వాస్తవానికి క్రితంసారి మద్యం విధానానికి సంబంధించి మద్యం దుకాణదారుల ఎంపికకు 2021 నవంబరులో టెండర్లు నిర్వహించారు. వాటి గడువు ఈ ఏడాది నవంబరు 30 వరకూ ఉంది. ఇప్పుడు మాత్రం ఆగస్టులోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం గమనార్హం. వచ్చే నవంబరు లేదా డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశముండటంతోనే ముందస్తుగా టెండర్లు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ నెల 4 నుంచి 21వ తేదీలోగా దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈసారి మద్యం దుకాణాల లైసెన్స్ రుసుంను గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఆరు స్లాబులుగా ఖరారు చేసింది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుంను 2 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఒక దరఖాస్తుదారుడు ఎన్నైనా దరఖాస్తులు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రతి దరఖాస్తుకు విధిగా2 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల రుసుం కింద ఈసారి 1500-1800 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా.
క్రితంసారి తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజికవర్గాల వ్యాపారులకు టెండర్లలో రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఈసారీ వాటిని కొనసాగించనుంది. రిజర్వేషన్ కేటగిరీలో భాగంగా 786 మద్యం దుకాణాల్లో గౌడ సామాజికవర్గానికి 393 , ఎస్సీలకు 262 ఎస్టీలకు 131షాపులు కేటాయించారు. వ్యాపారులకు ఆర్డినరీ మద్యం విక్రయాలపై 27 శాతం.. మీడియం, ప్రీమియం మద్యంపై 20 శాతం.. బీర్లపై 20 శాతం మార్జిన్ నిర్ణయించారు. మద్యం దుకాణాదారులు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక లైసెన్స్ రుసుంలో 25 శాతం మొత్తానికి 25 నెలల పాటు బ్యాంకు పూచీకత్తు ఇవ్వాలి. గతంలో మాదిరిగానే రాష్ట్రమంతటా దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే తెరవాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు సాగించే వెసులుబాటు కల్పించారు.