Telangana: గెలుపు ధీమా.. మ్యాజిక్ ఫిగర్.. ఎంతెంత దూరం?
Telangana: పోలింగ్ లెక్కలతో పార్టీ అభ్యర్థులు బిజీ
Telangana: గెలుపు ధీమా.. మ్యాజిక్ ఫిగర్.. ఎంతెంత దూరం?
Telangana: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపోటములపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈసారైనా అధికారంలోకి వస్తున్నామా, లేదా అన్నదానిపై అభ్యర్థులు, ముఖ్య నేతలు, పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కనిపిస్తోంది. పోలింగ్ సరళి అనుకూలమనే లెక్కలు, తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నారనే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమవుతాయా.. మ్యాజిక్ ఫిగర్ దాటి పవర్‌లోకి వస్తామా అన్న దానిపైనే కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఇంకా ఒక్కరోజే మిగిలిఉంది. దీంతో ఎన్ని స్థానాల్లో గెలుస్తాం? ఎక్కడెక్కడ గట్టి పోటీ ఇవ్వనున్నాం? ఎక్కడెక్కడ ఓడిపోవచ్చు? దక్షిణ తెలంగాణను నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్, శివారు నియోజకవర్గాల పరిస్థితేంటి? అన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇదే తీరు. అదే ఉత్కంఠ.
ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. తాము గెలుస్తామా.. లేదా అన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలతో భేటీ అవుతూ.. ఏ గ్రా మంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో తమకు పడిన ఓట్లెన్ని? ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత తక్కువ వస్తాయనే అంశాలతో క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిపై అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు.
ఇదే సమయంలో రేపు జరగనున్న కౌంటింగ్ కోసం ఏజెంట్లు, వారికి కావాల్సిన పత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నామో, కౌంటింగ్ కేంద్రాల్లోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా తేడా రాకుండా కౌంటింగ్‌ను పరిశీలించాలని ఏజెంట్లకు సూచనలిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. టీపీసీసీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని వారికి వివరిస్తూ, ఏయే పరిణామాలు తలెత్తితే ఎలా ఎలా వ్యవహరించాలన్న దానిపై హైకమాండ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. రేపు వెలువడే ఫలితాల్లో పార్టీకి వచ్చే సీట్లను బట్టి ఏఐసీసీ, టీపీసీసీ ప్రణాళికలను సిద్ధం చేయనున్నాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఎక్కువ సీట్లతో గెలవకుంటే.. గెలిచిన నాయకులందరినీ తక్షణమే కర్ణాటకకు తరలించి క్యాంపు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.