రిటైర్మెంట్‌ పెంపు.. ఐఆర్‌పై చర్చ

Update: 2019-06-18 04:26 GMT

ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్, కొత్త మున్సిపల్ చట్టం, రెవిన్యూ సంస్కరణలతో పాటు పలు కీలక అంశాలను చర్చించేందుకు తెలంగాణ మంత్రి వర్గం నేడు సమావేశం కానుంది. వరుస ఎన్నికలు రావడంతో గత ఐదు నెలల్లో మంత్రి వర్గం సమావేశం కాలేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికలు పూర్తి కావడంతో మంత్రి వర్గం నేడు భేటి కానుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్న ప్రభుత్వం అంతకు ముందే కొత్త మున్సిపల్ చట్టాన్ని ఆమోదించనున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెవిన్యూ సంస్కరణలపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది. దీంతో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్ కార్పోరేషన్ ద్వారా 11 వేల కొట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు క్యాబినేట్ అమోదం తెలుపనుంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ఐఆర్‌ పై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న స్థాయిలో ఐఆర్ ఇస్తే ఏ మేరకు భారం పడనుందనే అంశాలను చర్చించనున్నారు.

విభజన అనంతరం ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగించే ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది. పాత సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ కు భూమి పూజపై కూడా కేబినేట్ చర్చించనుంది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ భవన సముదాయం వద్ద నూతన అసెంబ్లీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నెల 27 వరకు మంచి ముహూర్తాలు ఉన్నందున శంకుస్థాపనపై కేబినేట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Tags:    

Similar News