Teenmar Mallanna: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. ఈ ఏడాది ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం వివరణ కోరింది.ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని తీన్మార్ మల్లన్నకు గడువు ఇచ్చింది క్రమశిక్షణ సంఘం. గడువు తీరినా కూడా ఆయన నుంచి వివరణ రాకపోవడంతో సస్పెన్షన్ విధించారు.
ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. దీంతో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. కుల గణన సర్వేకు సంబంధించిన రిపోర్టు విషయంలో మల్లన్న తీరుపై పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. ఆ తర్వాత ఓ సమావేశంలో ఆయన ఓ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలాన్ని రేపాయి.
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: మహేశ్ కుమార్ గౌడ్
భవిష్యత్తులో ఎవరూ పార్టీ లైన్ దాటినా వారిపై కఠిన చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యల విషయమై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన చెప్పారు. పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నందున తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.