SLBC Tunnel Tragedy: అసలు ప్రమాదం ఎలా జరిగింది? వారిని కాపాడటంలో వస్తోన్న ఇబ్బందులేంటి?

What happened in SLBC Tunnel tragedy: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం ఎలా జరిగింది? వారిని కాపాడటంలో ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?

Update: 2025-02-27 15:15 GMT

Slbc Tunnel Accident Update: కొనసాగుతున్న సహాయ చర్యలు..ఆ 8 మందిపై రేపు సాయంత్రానికి క్లారిటీ ?

Rescue operations at SLBC Tunnel: క్షణాలు... గంటలయ్యాయి.. గంటలు ఆరు రోజులు రోజులయ్యాయి. కానీ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది గురించిన సమాచారం రాలేదు. ఆక్సిజన్ అందుతోందా? వారు సురక్షితంగానే ఉన్నారా? రెస్క్యూ బృందాలు ఏం చెబుతున్నాయి? టన్నెల్ లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం తీరుపై విపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తున్నాయి? ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

Full View టన్నెల్‌లో అసలు ఏం జరిగింది?

అది ఫిబ్రవరి 22 , 2025... ఉదయం తొమ్మిదిగంటలు.... ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ సొరంగం తవ్వకం కోసం కార్మికులు వెళ్లారు. సొరంగం తవ్వడం కోసం కార్మికులు, ఇంజనీర్లు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.

అప్పుడే అలజడి మొదలైంది. టన్నెల్ లో నీటి ఊట ప్రారంభమైంది. అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది.

కొద్దిసేపటికే సొరంగం పైకప్పు కుప్పకూలింది. సొరంగం పైకప్పు కూలడానికి ముందే 42 మంది కార్మికులు బయటకు వచ్చారు. సొరంగం తవ్వకం పనుల కోసం ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్ అంటే టీబీఎంకు ముందు వైపు ఉన్న ఎనిమిది మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది పనిచేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ , శ్రీనివాస్, జార్ఖండ్ కు చెందిన సందీప్ సాహు, జగ్తా జెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహూ, పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన సన్నీసింగ్ చిక్కుకున్నారు. టన్నెల్ లోని 14వ కి.మీ. ప్రమాదం జరిగింది.

42 మంది కార్మికులు ఎలా బయటకు వచ్చారంటే?

సొరంగం తవ్వే టీబీఎం 120 నుంచి 150 మీటర్ల పొడవు ఉంటుంది. సొరంగం తవ్వకం పనులు చేసే కార్మికులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది రైలు వ్యాగన్ లాంటి వాహనంలో టన్నెల్‌లోకి వెళ్తారు. ప్రస్తుతం పూర్తైన 13 కిలోమీటర్ల సొరంగంలోకి వెళ్లడానికి గంట సమయం పడుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం వెనుక ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. వాటర్ సీపేజీ పెరిగి కాంక్రీట్ సెగ్మెంట్స్ కూలిపోయాయి. దీనికి తోడు నీరు, మట్టి కూడా టీబీఎంపై పడిపోయాయి. అయితే ఇవి పడిపోవడానికి ముందే వాటర్ సీపేజీని గుర్తించిన కార్మికులు, సిబ్బంది 42 మంది బయటకు వచ్చారు. అయితే నీటి ఊట క్రమంగా పెరగడంతో ఒకరు కొట్టుకుపోయారు. పక్కనే ఉన్నవారు అతడిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు.

2019లో పనులు ఎందుకు నిలిపివేశారంటే?

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ను రెండు వైపులా తవ్వుతున్నారు. మొత్తం 40 కి.మీ. సొరంగం తవ్వాలి. శ్రీశైలం జలాశయం ఎగువన నుంచి సొరంగం తవ్వుతున్నారు. దీన్ని టన్నెల్ 1 గా పిలుస్తారు. టన్నెల్ 1 పనులను నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ప్రారంభించారు. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ టన్నెల్ పనులు 9.56 కి.మీ పూర్తి చేయాలి. ఈ టన్నెల్ తవ్వకం సమయంలోనే ప్రమాదం జరిగింది. అవతలివైపు అంటే సొరంగం నుంచి నీళ్లు బయటకు వచ్చే ప్రాంతం నుంచి మరో వైపు నుంచి సొరంగం పనులు చేస్తున్నారు. ఈ టన్నెల్ నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవర్ పల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. దీన్ని టన్నెల్ 2 గా పిలుస్తారు.

టన్నెల్ 1 లో సొరంగం పనులు 2019 డిసెంబర్ 20లో నిలిపివేశారు. టన్నెల్ లో 13.936 కిలోమీటర్ల వద్ద సొరంగం పనులు చేసే సమయంలో వాటర్ సీపేజీ రావడంతో పనులు నిలిపివేశారు. ఈ ప్రాంతంలో మట్టి వదులుగా ఉంటుంది. దీంతో త్వరగా మట్టి కిందపడిపోయే అవకాశం ఉంది. టన్నెల్ పనులు జరుగుతున్న సమయంలో గోడలు జారిపడే అవకాశం ఉంది. సొరంగం తవ్వే సమయంలో మట్టి కిందకు జారకుండా సిమెంట్ గ్రౌంటింగ్ చేస్తారు. అయితే వాటర్ సీపేజీ కారణంగా ఈ సిమెంట్ గ్రౌంటింగ్ కూడా పైకప్పు నుంచి ఊడిపడ్డాయి.మరో 10 మీటర్లు సొరంగం తవ్వితే వదులుగా ఉన్న మట్టి ఉన్న భూమి బదులు గట్టి భూమి వచ్చేదని ఇంజనీర్లు చెబుతున్నారు.

రెస్క్యూకు అడుగడుగునా ఆటంకాలు

టన్నెల్ 1 లో వాటర్ సీపేజీ ఎక్కువగా ఉంది. నిమిషానికి 5 వేల లీటర్ల నీరు టన్నెల్ లోకి వస్తోంది. నీటితో పాటు మట్టి కూడా చేరుతోంది. సొరంగం పైకప్పు కూలడంతో టన్నెల్ బోరింగ్ మెషీన్ 90 మీటర్లు వెనక్కి వచ్చింది. ఈ మెషీన్ ముందు భాగం రెండు ముక్కలైంది. టన్నెల్ లో 12వ కిలోమీటరు వరకు మాత్రమే సులభంగా వెళ్లే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వరకు వెళ్లేందుకు రెస్క్యూ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. సొరంగం పైకప్పు కూలిన ప్రాంతంలో 70 శాతం బురద, 30శాతం నీళ్లున్నాయి. దీంతో అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. సొరంగంలో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా. టన్నెల్ లోని కన్వేయర్ బెల్ట్ కు కూడా సిబ్బంది రిపేర్ చేశారు. కన్వేయర్ బెల్ట్ సహాయంతో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే ఛాన్స్ ఉంది.

సొరంగం చివరి 40 మీటర్లలో రెస్క్యూ సిబ్బంది వెళ్లేందుకు కష్టపడుతున్నారు. ఇక్కడ బురద ఎక్కువగా ఉంది. 15 అడుగుల బురద పేరుకుపోయింది. చిమ్మ చీకటి, గాలి లేదు. ఫిబ్రవరి 27న మాత్రం రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి పేర్లు పిలుస్తూ వారి నుంచి స్పందన కోసం ప్రయత్నించారు. కానీ, వారికి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

సహాయక చర్యల్లో ఎవరెవరు?

టన్నెల్‌లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు రంగంలోకి దిగాయి. వీరికి తోడు ప్రైవేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. 130 మంది ఎన్ డీ ఆర్ ఎఫ్, 24 మంది హైడ్రా, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 120 మంది ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ నుంచి ర్యాట్ మైనింగ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరికి తోడు మేఘా, నవయుగ, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్ నిపుణులు ఇలా సుమారు 300 మంది మూడు షిఫ్టులుగా టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది.

ఆ ఎనిమిది మంది పరిస్థితి ఎలా ఉంది?

ఆరు రోజుల క్రితం చిక్కుకున్న ఎనిమిది మంది గురించిన సమాచారం ఇంకా తెలియ రాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. అక్కడ బురద, టీబీఎం మెషీన్ భాగాలు పడి ఉన్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలించాయి. కానీ, వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇంతవరకు కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

15 మీటర్లు కూడా తవ్వలేదు

ఆరు రోజులైనా ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో చిక్కుకున్న ఆరుగురు ఆచూకీ లభించకపోవడం ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎస్ ఎల్ బీ సీకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 3,300 కోట్లు ఖర్చు పెడితే తాము మాత్రం 3900 కోట్లు ఖర్చు చేశామన్నారు.

రెండు మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి

ఎస్‌ఎల్ బీ సీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్ పై గులాబీ పార్టీ విమర్శలపై హస్తం పార్టీ కౌంటరిచ్చింది. తప్పుడు ప్రచారం చేయవద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విపక్షాన్ని కోరారు.టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్స్ లో అత్యంత అనుభవం ఉన్న నిపుణులను రప్పించామన్నారు. టీబీఎం మెషీన్ వెనుక వైపు ఉన్న శిథిలాల తొలగింపు చర్యలు ప్రారంభించినట్టు మంత్రి వివరించారు.

ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ టీమ్ చేరుకోగలిగింది. కానీ, సహాయక చర్యలకు శిథిలాలు, బురద అడ్డంకిగా మారింది. దీంతో వీటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. టీబీఎం మెషీన్ వద్ద శిథిలాలు తొలగిస్తే టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ఎనిమిది మంది సురక్షితంగా ఉండాలని కోరుకుందాం.

Tags:    

Similar News