SLBCలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆశలు వదులుకుంటున్న అధికారులు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావడంతో వారు బ్రతికే ఉన్నారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
SLBCలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆశలు వదులుకుంటున్న అధికారులు
SLBC: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావడంతో వారు బ్రతికే ఉన్నారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో భారీ ఎత్తున మట్టి కూలడం, నీరు బురద చేరడంతో ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువని భావిస్తున్నారు. వారంతా బురదలోనే టన్నెల్ బోరింగ్ మెషిన్ చుట్టూ కూరుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
SLBC సొరంగంలో చేపట్టిన పనుల్లో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదంగా మారింది. శనివారం ఉదయం 8.30 గంటలకు టన్నెల పైకప్పు కూలడంతో 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అయితే ఆరు రోజులవుతున్నా వారి ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. దీంతో కార్మికులు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. కార్మికులు ఒకవేళ ప్రమాదంలో గాయపడినా నీళ్లు, ఆహారం లేకుండా జీవించడం కష్టమని చర్చ జరుగుతోంది. మరోవైపు బురద, నీరు, మట్టి, రాళ్లతో టన్నెల్ ఎక్కడికక్కడ పూడుకుపోవడం, శిథిలాల తరలింపుకు సమయం పడుతుండడంతో కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మరోవైపు కార్మికులను కాపాడేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని కట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నుంచి కట్టింగ్ పనులు ప్రారంభంకానున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మిషన్ భారీగా దెబ్బతిన్నది. ఆ తర్వాత ఒత్తిడితో దాని వ్యర్థాలు ముందుకు తోసుకువచ్చాయి. దాన్ని దాటి వెళ్తే కానీ కార్మికులను కాపాడే ప్రయత్నాలు ఫలించవు. దీంతో టీబీఎంను కట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు ప్రారంభంకానున్నాయి.