తెలంగాణ సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభం

Update: 2019-08-08 01:36 GMT

తెలంగాణ సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి వివిధ శాఖలను తరలించనున్నారు. మొదటగా ఆర్‌అండ్‌బీ శాఖ తరలివెళ్లనుంది. లాంఛనంగా ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ కార్యాలయానికి రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ వెళ్లారు. నేటి నుండి అక్కడికే రావాలని సిబ్బందికి ఆదేశాలు చేశారు. ఈఎన్సీ కార్యాలయంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీ ఉంది. ముందుగా మంత్రుల ఛాంబర్లను తరలించాలని సీఎం ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో మంత్రుల ఛాంబర్లు తరలిపోనున్నాయి. బీఆర్కే భవన్‌ని జీఏడీ అధికారులు పరిశీలించారు.

సెక్రటేరియట్ తరలింపును యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు అధికారులు. ఎప్పుడో చేయాల్సిన శాఖల తరలింపు ప్రక్రియను ఆగమేఘాలపై మొదలుపెట్టారు అధికారులు. బి.ఆర్కే భవన్ సిద్ధం కాలేదని ఆర్.అండ్.బి. శాఖ అధికారులు తేల్చి చెప్పినప్పటికీ తరలింపు వేగం పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే తరలింపు ఆలస్యమైందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి రెండు రోజులుగా అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే తరలింపు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే, ఆర్‌అండ్‌బి అధికారులు మాత్రం బి.ఆర్కే భవన్ సిద్ధం చేయడానికి మరికొంత గడువు కోరారు. కానీ, ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. ఓ వైపు మరమ్మతులు జరుగుతున్నా తరలింపు ముమ్మరం చేయాలని నిర్ణయించారు.

సీఎస్ ఎస్.కె.జోషి సమీక్ష నిర్వహించి తరలింపు వేగం పెంచాలని ఆదేశించారు. జీఏడీ అధికారులను బి.ఆర్కే భవన్‌ను పరిశీలించి రావాలని సూచించారు. అంతేకాకుండా తన పేషీని వెంటనే తరలించాలని ఆదేశించినట్టు తెలిసింది. తరలింపు కోసం కావాల్సిన బాక్సులు సేకరించి ఫైళ్లు సర్దుతున్నారు. వచ్చే వారం నుంచి సెక్రటేరియట్ కార్యకలాపాలు పూర్తిగా బిఆర్కే భవన్‌ నుంచి నిర్వహించనున్నారు. ఆగస్టు 15న బి.ఆర్కే భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరపాలని నిర్ణయించారు. దీనికోసం బి.ఆర్కే భవన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అదర్‌సిన్హా. సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు షిఫ్టింగ్ ప్రారంభించారు అధికారులు. ముందుగా ఆర్‌అండ్‌బి శాఖ తరలింపును మొదలుపెట్టిన అధికారులు ఆర్‌అండ్‌బి మంత్రి, ముఖ్య కార్యదర్శి పేషీల తరలింపునకు శ్రీకారం చుట్టారు.

Full View  

Tags:    

Similar News