Slbc Tunnel Accident Update: కొనసాగుతున్న సహాయ చర్యలు..ఆ 8 మందిపై రేపు సాయంత్రానికి క్లారిటీ ?
Slbc Tunnel Accident Update: కొనసాగుతున్న సహాయ చర్యలు..ఆ 8 మందిపై రేపు సాయంత్రానికి క్లారిటీ ?
Slbc Tunnel Accident Update: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8మంది కార్మికుల జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా వారు గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సొరంగ మార్గంలో ఉన్న మట్టి, రాళ్లు, ఇతర లోహాలకు భిన్నంగా సుమారు 3 నుంచి 5 మీటర్ల లోపల మెత్తని పొరలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో తవ్వితే కానీ అవి ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ నీరు అధికంగా ఊరుతుండటంతో నిపుణులు సూచించిన లోతు వరకు మట్టిని తోడలేకపోతున్నారు. ఇదే సహాయక బృందాలకు ప్రధాన ఆటంకంగా మారుతోంది. నేడు లేదా రేపు సాయంత్రానికి సొరంగంలో జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించిన ఆ ప్రాంతాల్లో ఏముందో తేలిపోతుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు మొదలైనట్లు సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు.
మృతదేహాలను గుర్తించినట్లు సోషల్ మీడియాల్లో వచ్చిన వార్తలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కొట్టి పారేశారు. ఎన్జీఆర్ఐ కొన్ని ప్రాంతాలను మాత్రమే గుర్తించిందని..ఆ ప్రాంతాలలో ప్రమాదంలో చిక్కుకున్న వారు ఉంటారన్న నమ్మకం లేదన్నారు. అది లోహం కానీ లేదా మరేదైనా పదార్థం అయినా కావచ్చంటూ వివరించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని..ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తామని పేర్కొన్నారు.