Telangana: ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..రూ. 75వేల ఆర్థిక సాయం..!!

Telangana: ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..రూ. 75వేల ఆర్థిక సాయం..!!

Update: 2025-12-30 09:41 GMT

Telangana: తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. సమాజంలో ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్ వర్గానికి ఆర్థిక భద్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన జీవనానికి బాటలు వేసే దిశగా కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాన్స్‌జెండర్లు సొంతంగా ఉపాధి సాధించుకుని స్వావలంబనతో జీవించేందుకు ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీతో లోన్స్ ఇవ్వనున్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గరిష్టంగా రూ.75 వేల వరకు ఆర్థిక సాయం మంజూరు చేయనున్నారు. ఇది పూర్తిస్థాయి సబ్సిడీ రుణం కావడంతో, ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పథకం ద్వారా ఏదైనా వృత్తి లేదా రంగంలో నైపుణ్య శిక్షణ పొంది, చిన్న స్థాయిలో స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారం, సేవారంగం లేదా ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిలదొక్కుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఇది గొప్ప అవకాశం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి అర్హులు. అర్హత ప్రమాణాలు పూర్తిచేసిన వారు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద మొత్తం 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి గల అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న సంబంధిత కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

దరఖాస్తులు వచ్చే నెల జనవరి 31వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి, అర్హతలు కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు లేదా సందేహాల నివృత్తి కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడం, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సమాజంలో సానుకూల మార్పుకు దారితీయనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News