Renu Desai: వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు

వీధి శునకాల ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ, నటి రేణు దేశాయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Update: 2026-01-19 09:43 GMT

Renu Desai: వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు

Renu Desai : వీధి శునకాల ఘటనలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో టాలీవుడ్ నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సోమాజిగూడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, వీధి కుక్కలపై జరుగుతున్న చర్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల వీధి శునకాలు కాటు వేస్తే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన రేణు దేశాయ్, ఒక్క కుక్క తేడాగా ప్రవర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కానీ ఆ కారణంతో వందల సంఖ్యలో నోరు లేని శునకాలను చంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

అన్ని వీధి కుక్కలు ప్రమాదకరమని భావించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. తాను ప్రతిరోజూ వందల సంఖ్యలో కుక్కలకు సేవలు అందిస్తానని, తన ఇంట్లో కూడా అనేక కుక్కలు ఉన్నప్పటికీ ఎప్పుడూ కాటు ఘటన జరగలేదని తెలిపారు.

ఇతర సామాజిక సమస్యలపై కూడా రేణు దేశాయ్ దృష్టి సారించారు. ప్రతి ఏడాది లక్షల మంది దోమకాట్ల కారణంగా మరణిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే ఘటనలు, మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు వంటి అంశాలపై మాత్రం సరైన స్పందన ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు.

నోరు లేని జీవాలపై మాత్రమే కోపం చూపడం సరికాదని, కుక్కలను చంపిన తర్వాత మనుషులకు నిద్ర ఎలా పడుతుందని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుందని పేర్కొంటూ, వీధి శునకాల సమస్యకు మానవీయ పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News