IIIT: విద్యార్థులకు గుడ్ న్యూస్.. బాసర తరహాలో మరో ఐఐటీ.. ఎక్కడంటే..??
IIIT: విద్యార్థులకు గుడ్ న్యూస్.. బాసర తరహాలో మరో ఐఐటీ.. ఎక్కడంటే..??
IIIT: మహబూబ్‌నగర్ జిల్లా విద్యారంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఒక కీలక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లి గ్రామ పరిధిలో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ విద్యాసంస్థ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే కేంద్రంగా నిలవనుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపడుతున్న అతిపెద్ద విద్యా ప్రాజెక్టులలో ఈ ట్రిపుల్ ఐటీ ఒకటిగా నిలుస్తోంది. నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు కానున్న రెండో ట్రిపుల్ ఐటీ ఇదే కావడం గమనార్హం. వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో ఈ సంస్థ ఏర్పాటు కావడంతో, స్థానిక విద్యార్థులు ఇంజనీరింగ్, ఐటీ విద్య కోసం ఇతర రాష్ట్రాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదు. ఈ క్యాంపస్ ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడి, ఈ ప్రాంతం సాంకేతిక అభివృద్ధికి కేంద్రంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అనంతరం క్యాంపస్ పైలాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కష్టపడి చదివి రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందంజలో నిలపాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మెగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసి, త్వరితగతిన తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.