Warangal Airport: మామునూరు ఎయిర్ పోర్ట్ ఆలస్యానికి కారణం ఏంటంటే...

Update: 2025-03-02 11:42 GMT

Warangal Airport: మామునూరు ఎయిర్ పోర్ట్ ఆలస్యానికి కారణం ఏంటంటే...

Rammohan Naidu about Warangal airport: వరంగల్ ఎయిర్ పోర్ట్ స్వాతంత్య్రం రాక ముందే చాలా కీలకంగా పనిచేసిందని చరిత్ర చెబుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ తరువాత కాలంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరగడంతో వరంగల్ ఎయిర్ పోర్ట్ మూసేసే పరిస్థితి తలెత్తిందని గుర్తుచేశారు. అయినప్పటికీ వరంగల్‌లో మళ్లీ ఎయిర్ పోర్ట్ వస్తే చూడాలనే స్థానికుల డిమాండ్ మాత్రం తగ్గలేదన్నారు. 2014లో కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తరువాత విమానయాన రంగంలో భారీ వృద్ధి కనిపిస్తోందని తెలిపారు.

దేశంలో మొత్తం ఎయిర్ పోర్టుల సంఖ్య 

మోదీ సర్కారు రావడానికి ముందు దేశంలో కేవలం 76 ఎయిర్ పోర్టులు ఉండేవి. కానీ మోదీ సర్కార్ వచ్చిన తరువాత ఈ పదేళ్లలో దేశంలో మొత్తం ఎయిర్ పోర్టుల సంఖ్య 159 కి చేరుకుందని అన్నారు. పౌరవిమానయాన రంగానికి మోదీ ఇచ్చిన ప్రాధాన్యతే అందుకు కారణం అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత వేగంగా ఇన్ని ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేయలేదన్నారు.

వరంగల్ ఎయిర్ పోర్ట్ కు తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

ఎందుకు ఇంత ఆలస్యమైందంటే...

"వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ వద్ద ఎయిర్ పోర్ట్ అథారిటికి 696 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో ఉన్న రెండు రన్ వేలు కూడా ఉపయోగించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ రన్ వే మార్గాలు కూడా కేవలం 1800 మీటర్ల పొడవు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంత చిన్న విమానాలకైనా కనీసం 2800 మీటర్ల రన్ వే అవసరం అవుతుంది. ఆ రన్ వే మార్గాలను విస్తరించాలంటే అదనంగా మరింత భూమి అవసరం అవుతోంది. అందుకే వరంగల్ విమానాశ్రయం కోసం అదనంగా 280 ఎకరాలు కేటాయించాల్సిందిగా కేంద్రమే గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ విషయంలో సహకారం లేకపోవడం వల్లే వరంగల్ ఎయిర్ పోర్ట్ పునఃప్రారంభానికి ఆలస్యం అవుతూ వచ్చింది" అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

జీఎంఆర్‌తో ఒప్పందం ఆ ఆలస్యానికి మరో కారణం

శంషాబాద్ విమానాశ్రయం నిర్మించినప్పుడు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముందుకొచ్చిన జీఎంఆర్ సంస్థ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌కు చుట్టుపక్కల 150 కిమీ వరకు ఎక్కడా మరో విమానాశ్రయం నిర్మించకూడదనే నిబంధన ఉంది. అలా ఇంతకాలం వరంగల్ విమానాశ్రయం ఆలస్యం అవడానికి భూసేకరణ ఒక కారణం కాగా జీఎంఆర్ తో ఒప్పందం రెండో కారణంగా చెప్పుకొచ్చారు.

తాజాగా కేంద్రమే చొరవ తీసుకుని జీఎంఆర్‌ను ఒప్పించి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఎన్ఓసీ తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది నవంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం అవసరమైన అదనపు స్థలం కేటాయించింది. అందుకే ఇన్నాళ్లకు వరంగల్ ఎయిర్ పోర్ట్ కల సాకారం అవుతోందని రామ్మోహన్ నాయుడు వివరించారు.

Full View

వరంగల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని మీడియాతో పంచుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కింజారపు రామ్మోహన్ నాయుడు ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

Tags:    

Similar News