ఈనగరానికి ఏమైంది..వానలిలా కురుస్తున్నాయి!

Update: 2020-01-03 08:52 GMT
Hyderabad Rain

కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. మబ్బులు..వానలు..వరుసగా మూడురోజులుగా ఇదే పరిస్థితి. నగరవాసులకు ఈ వాతావరణం వింతగా అనిపిస్తోంది. తెల్లవారుజాము విపరీతమైన చలి.. తరువాత కొద్దీ సేపు మబ్బులతో కూడిన చిరు జల్లులు. తరువాత ఎండ. ఇక సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం. అసలు ఇలాంటి వాతావరణం గతంలో అదీ జనవరి నెలలో ఎప్పుడూ చూసి ఉండలేదు హైదరాబాద్ వాసులు. ఇప్పుడు ఈ వింతైన వాతావరణాన్ని ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నా..ఉదయం సాయంత్రం ఉరుకులు పరుగులతో ఉండే జీవులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది మన నగరానికి అని చర్చించుకుంటున్నారు.

అయితే, వీరిలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. హైదరాబాద్ లో గతంలో ఒకసారి ఇలా జనవరి నెలలో వర్షం కురిసింది. అప్పుడెప్పుడో 1922 లో జనవరి మూడో తేదీన ఇలా వాన కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం అప్పుడు 93.2 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇప్పుడు గురువారం రాత్రివరకూ కురిసిన వర్షం దానికంటే చాలా తక్కువనే చెప్పాలి. ఈ రెండురోజుల్లోనూ కలిపి సగటున 36.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 

ఎందుకిలా..

''ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల నగరంలో మరింత తడి వాతావరణం ఉంటోంది. ఈ తేమ గాలులు వల్ల మేఘాలు ఏర్పడి వర్షం పడుతోంది'' అని భారత వాతావరణ విభాగం అధికారి రాజారావు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తడి వాతావరణం ఉంటుందని నగరంలోని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ఎన్నాళ్ళిలా..

జనవరి 4 వరకూ మెరుపులతో కూడిన వర్షం హైదరాబాద్‌లో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో చలిగాలులు కూడా ఎక్కువగా ఉంటాయని వారంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సరాసరిన 2 నుంచి 3 డిగ్రీలు పడిపోయే అవకాశాలున్నాయని వెల్లడించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. స్కైమేట్ వాతావరణ సంస్థ జనవరి 4 తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని తన నివేదికలో వెల్లడించింది.

అందువలన ఈ రెండు రోజులూ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాస్తవ్యులు ఫిక్స్ అయి తమ పనులను ప్లాన్ చేసుకుంటే బెటర్. అంతేకాదు.. ఈ చలికాలం మరింత చల్లగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతూన్నందు వలన తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 


Tags:    

Similar News