Aadhaar: హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నుంచి నోటీసులు

Update: 2020-02-19 05:11 GMT
హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నుంచి నోటీసులు

తప్పుడు పత్రాలతో ఆధార్‌ పొందడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసింది. నకిలీ పత్రాలతో ఆధార్ కార్డు తీసుకున్నారని ఈనెల 20వ తేదీన విచారణాధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ రాయల్ కాలనీలోని మెగా గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

హైదరాబాద్ తలాబ్ కట్టకి చెందిన మహమ్మద్ సత్తార్ ఖాన్ ‌కు ఆధార్ వ్యవస్థ నుంచి నోటీసులందాయి. విచారణకు వచ్చేటప్పుడు పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాలని, ఒకవేళ భారత జాతీయుడు కాకపోతే భారతదేశంలోకి చట్టబద్ధంగానే అడుగుపెట్టినట్లు నిరూపించుకునే డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించారు.

ఒకవేళ ఈ విచారణకు హాజరు కాకపోయినా, పౌరసత్వం నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవని భావించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని వెల్లడించారు.

అసలు ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని ఒకపక్క చెబుతూనే మరోపక్క ఆధార్ కార్డు తీసుకున్నందుకు పౌరసత్వం నిరూపించుకోవాలని అడగటం ఏమిటని సత్తార్ ఖాన్ తరపు న్యాయవాది ముజఫర్ ఉల్లా ఖాన్ ప్రశ్నించారు. ఇలాంటి నోటీసులు చాలామందికి వచ్చాయని, వారి సంఖ్య ఎంత అనేది 20వ తేదీన తేలుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు.


Full View

 

Tags:    

Similar News