Republic Day 2020: అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన త్రివర్ణ పతాకం

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 71వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ జాతీయ జెండా ఎగురవేసారు.

Update: 2020-01-26 08:22 GMT
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (ఫైల్ ఫోటో)

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 71వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ జాతీయ జెండా ఎగురవేసారు. కాగా కొన్ని అనివార్య కారణాల వలన జాతీయపతాకావిష్కరణ చేయడంలో కాస్త ఆలస్యం చోటు చేసుకుంది. జెండా ఎగరవేయడానికి లాంఛనాలతో ముందుకొచ్చిన గవర్నర్ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ జెండా ఎగరకుండా అలాగే ఉండి పోయింది. దీంతో అధికారులు ఆ జెండాను కిందికి దించి సరిచేసారు. దీంతో గవర్నర్‌ మరోసారి జెండా ఎగరవేసే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ అది పైకి వెళ్లిందే కానీ ఎగరలేదు. దీంతో మరో సారి అధికారులు జాతీయ జెండాను కిందకు దించి సరిచేసిన తరువాత గవర్నర్ మళ్లీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎట్టకేలకు ఈ సారి ప్రయత్నం ఫలించి జాతీయ పతాకం గాలిలో రెపరెపలాడింది. దీంతో వేడుకలను తిలకించడానికి వచ్చిన వారందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ నేపథ్యంలోనే జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించిన ప్రతి సారి అక్కడికి వచ్చిన సందర్శకులు జాతీయ గీతాలాపణ చేసారు. ఇదే విధంగా రెండు, మూడు సార్లు జెండా ఎగరకముందే గీతాలాపణ చేయడంతో సీఎం కేసీఆర్‌ విచారంగా చూశారు.

ఇక పతాకావిష్కరణ అనంతరం గవర్నర్ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసారని కొనియాడారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎ‍న్నో రకాల సమస్యలను ఆయన అధిగమించారని పొగిడారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, దీంతో పల్లెలన్ని సత్ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ ప్రజలకు నీటి కష్టాలను దూరం చేయడానికి మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేసారని తెలిపారు. కరెంటు కోత లేకుండా 24 గంటల కరెంటును, కొత్త ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో సాగు, తాగు నీరందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న అభివృద్ది పనులు ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేని స్వచ్ఛమైన రెవెన్యూ పాలన అందించాలని నిర్ణయించామన్నారు. ప్రసంగం ముగిసిన అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్‌, జై తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా కేసీఆర్‌, మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు.

Tags:    

Similar News