BRS: బీఆర్ఎస్‌లో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక‌పై కేసీఆర్ కసరత్తు

BRS: ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించింది

Update: 2023-06-26 08:27 GMT

BRS: బీఆర్ఎస్‌లో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక‌పై కేసీఆర్ కసరత్తు

BRS: అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇక వచ్చే ఎన్నికలకు బిఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు. మరో వైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా బీఆర్ఎస్ నేతలు ప్రజా క్షేత్రంలో వుంటున్నారు. ఇక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటుగా కీలక నేతలు కేటీఆర్,హరీష్ రావు,కవిత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించింది.ఇక తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా అధికార బిఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది నేతలు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు గులాబీ బాస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది.ఇక అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లో అసమ్మతి కనిపిస్తే సరిదిద్దుకోవడంతో పాటుగా బుజ్జగించడానికి అవకాశంఉంటుందని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. దీని ద్వారా నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఒకవేళ మాటవినని నేతలను వదులుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలకు ముందు ముందుగానే ఈ సారి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.అయితే ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో సెంటిమెంట్స్ బలంగా పాటించే కేసీఆర్ ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేనట్టుగా విశ్లేషణలు వినబడుతున్నాయి.

ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఓటర్లను ఎక్కువ సార్లు వ్యక్తిగతంగా కలిసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం చేయడంద్వారా బిఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ కోసం పోటీ పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ప్రాధాన్యం ఇస్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు.ఇక ప్రస్తుతం బీఆర్​ఎస్​ పార్టీకి అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేలు వున్నారు.ఒక వేళ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సి వస్తే సుమారు 20 నుండి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News