సెలైన్లతో.. శతాబ్దాల చరిత్రగల మర్రికి మళ్లీ జీవం

Update: 2019-11-16 06:31 GMT

కళతప్పిన ఊడల చెట్టు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన మహావృక్షం మళ్లీ కోలుకుంటోంది. చివరి దశలో ఉన్న చెట్టుకు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో జీవం పోసుకుటుంటోంది. వెంటిలేటర్‌పై ఉన్న శతాబ్దాల చరిత్రగల మర్రి చెట్టుకి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి సక్సెస్‌ అయ్యారు. ఇన్నాళ్లు ఎంత దర్పంగా ఉన్నానో ఇకముందూ అంతే గొప్పగా ఉంటానన్నట్లుగా పచ్చగా చిగురిస్తోన్న మహావృక్షంపై స్పెషల్‌ స్టోరీ

మహబూబ్‌నగర్ జిల్లా టూరిజం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది పిల్లలమర్రి. అలాంటి మర్రి చెదలు బారిన పడి జీవం కోల్పోయిన చెట్టు క్రమంగా ప్రాణం పోసుకుంటోంది. రెండేళ్ల క్రితం కృంగిపోయిన కూలిపోయిన చెట్టుకు సెలెన్ల ద్వారా స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ అందించడంతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. చెట్టంతా లేత ఆకులు, పచ్చని కొమ్మలతో చూపరులను ఆకట్టుకుంటోంది.

రోగాల బారిన పడిన మనుషులకే కాదండోయ్ వృక్షాలను కాపాడటానికి కూడా సెలైన్ వాడొచ్చని నిరూపించారు అధికారులు. దాదాపు 8 వందల ఏళ్ల చరిత్ర ఉన్నమహావృక్షం ఆనవాళ్లు కనిపించకుండా పోతున్న దశలో చెట్టును కాపాడుకునేందుకు అధికారులు తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. చెట్టుకు పట్టిన చీడలను నివారించేందుకు చర్యలు చేపట్టడంతో కొత్త ఆకులతో ఊడలచెట్టు కళకళలాడుతోంది.

చెదల వల్ల చెట్టు వేరు దెబ్బతినడంతో రెండు చోట్లు చెట్టు నేలకొరిగింది. వెంటనే స్పందించిన అధికారులు మొదట నేరుగా వేరు వద్ద రసాయన ద్రావణాలు వాడారు. అయితే అంతగా ప్రభావం చూపలేకపోవడంతో స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా సెలైన్ల ద్వారా చెట్టుకు ఎక్కిస్తూ ఆసుపత్రిలో రోగికి చేసే సపర్యల మాదిరిగా చెట్టుకు కూడా సెలైన్ రూపంలో చికిత్స అందిస్తున్నారు. చెదలు పట్టిన దాదాపు 55 ఊడలకు ప్రత్యేకంగా పైపులు అమర్చి వాటికి కెమికల్స్‌ కలిపిన మట్టిని వాడుతున్నారు. దీంతో 45 చోట్ల కొత్త ఊడలు ఏర్పడటంతో పాటు పడిపోయిన రెండు భారీ ఊడలు సైతం మళ్లీ చిగురించడంతో టూరిస్టులు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు దెబ్బతిన్న చెట్టు పరిసరాల్లోకి సందర్శకులను అనుమతించకుండా స్లోగన్లు రాశారు. టచ్‌మీ నాట్‌ సీ అండ్‌ ఎంజాయ్‌ అన్న పదాలు రాశారు. ఇప్పుడిప్పడే వృక్షానికి ఆకులు చిగురిస్తుండటంతో పర్యాటకులు సైతం దూరం నుంచి చెట్టును చూసి మురిసిపోతున్నారు. అయితే పూర్తిస్థాయిలో మహావృక్షం తిరిగి కోలుకునేందుకు మరింత చికిత్స అవసరమని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

Keywords : Telangana, Mahabubnagar, Pillalamarri

Tags:    

Similar News