నిత్యావసరాల 'ఆన్ లైన్' సేవలు 'లైన్' లోకి ఎప్పుడు వస్తాయో?

కరోనా ప్రభావంతో జనజీవనంతో పాటు అన్ని రకాల ఆన్ లైన్ సేవలూ తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Update: 2020-04-07 02:57 GMT
representational image

కరోనా ప్రభావంతో జనజీవనంతో పాటు అన్ని రకాల ఆన్ లైన్ సేవలూ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ-కామర్స్ సంస్థలన్నీ తమ సేవలు అందుబాటులో లేవని చెప్పాయి. లాక్ డౌన్ కారణంగా డెలివరీ లలో తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలనే దానిపై స్పష్టత లేక అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ వంటి ఆన్ లైన్ లో ప్రజలకు నిత్యావసరాలను అందించే సేవలు ప్రస్తుతం నడవడం లేదు. ఆన్ లైన్ లో అవి ఆర్దార్లు తీసుకోవడం నిలిపివేశాయి.

ప్రభుత్వం ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేయొచ్చని ఈ కామర్స్ సంస్థలకు వెసులుబాటు కల్పించినా, ఇప్పటికీ ఆ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించలేదు. తమ వెబ్ సైట్లలో తమ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయనీ, త్వరలో పునరుద్ధరిస్తామని చెబుతున్నాయి. తెలంగాణలో దాదాపు 500 ప్రాంతాల్లో ఈ కామర్స్ సంస్థలకు వినియోగదారులు ఉన్నారు. నిత్యావసర వస్తువులు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకునే వారి సంఖ్యా చెప్పదగ్గదిగానే ఉంది. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ ఎందుకనుకున్నాయో ఏమో ఆయా సంస్థలు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ తమ కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇన్నాళ్ళూ తటపటాయిస్తూ వచ్చాయి.

కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు..

ప్రస్తుతం ఆన్ లైన్ లో సేవలు అందించే సంస్థలు పూర్తిగా కాకపోయినా పాక్షికంగా తమ సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ దిశలో అమెజాన్ సంస్థ హైదరాబాద్ లో 40 ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒక్కసారిగా అన్ని ప్రాంతాలకూ సేవలను అందించకుండా నిదానంగా తమ సేవలను పునరుద్దరించడానికి అమెజాన్ చర్యలు చేపట్టింది. ఇక ఫ్లిప్ కార్ట్ త్వరలోనే తన సేవలు పునరుద్ధరిస్తామని చెబుతోంది. బిగ్ బాస్కెట్ వెబ్సైట్ లో సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నా.. వినియోగదారులు దానిని క్లిక్ చేసినప్పుడు మాత్రం డెలివరీ స్లాట్ లు అందుబాటులో లేవనే మేసేజ్ వస్తోంది. మొట్టమ్మీద ఈ సంస్థలన్నీ తమ సేవలను పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టేట్టు కనిపిస్తోంది. 

Tags:    

Similar News