Telangana: NSUI కార్యవర్గ సమావేశంలో తీవ్రఉద్రిక్త

Telangana: NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తీరును వ్యతిరేకించిన జిల్లా అధ్యక్షులు

Update: 2022-04-21 01:18 GMT

NSUI కార్యవర్గ సమావేశంలో తీవ్రఉద్రిక్త 

Telangana: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు వెంటాడుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అందరి నేతలను సమన్వయ పర్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఏదో రూపంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమై విబేధాలు పక్కకు పెట్టి పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని ప్రకటించారు. ఈలోగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలను ఫాలో అవుతున్నట్టుంది.

వరంగల్ లో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం నేతలు జనసమీకరణపై కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో పార్టీ పట్ల పాజిటివ్ టాక్ వస్తుందన్న సమయంలో గాంధీభవన్ వేదికగా వరుసగా జరుగుతున్న సంఘటనలు పార్టీ నేతలకు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. సీనియర్ నేతలు అధికారం కోసం తాపత్రయపడుతుంటే పార్టీ అనుబంధ సంఘాల నేతలు కమిటీలు,, ప్రాధాన్యత లేదంటూ పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహిస్తుండగానే మహిళా కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితను సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

ఈ ఇష్యూ మరిచిపోక ముందే NSUI కార్యవర్గ సమావేశం తీవ్రఉద్రిక్తకు దారి తీసింది. బల్లలు విసురుకోవడం.. ఒకరినొకరు తోసుకోడంతో సమావేశం కాస్తా అదుపుతప్పింది. NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తీరుపై జిల్లా అధ్యక్షులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. NSUI ఉపాధ్యక్షుడు చందన రెడ్డిని బల్మూరి వెంకట్ వర్గీయులు అడ్డుకున్నారు. ఇలా రోజుకో రకమైన విభేదాలతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి విభేదాలు పార్టీ పరువు బజారుకీడుస్తున్నాయంటూ లోలోన మధనపడుతున్నారు. అధిష్టానం హెచ్చరికలతో పెద్ద నేతలే కొద్దీ రోజులుగా మౌనం ప్రదర్శిస్తుంటే పార్టీని ఇబ్బందులకు గురి చేసేలా అనుబంధ సంఘాల గొడవల పై అటు అధిష్టానం ,ఇటు రాష్ట్ర నాయకత్వం ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News