మటన్ రేటు ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కార్..కేజీ ఎంతంటే..

ఆదివారం వచ్చిందంటే చాలు ఎవరి ఇంట్లో చూసినా చికెన్, మటన్ ఘుమఘమలు వస్తుంటాయి.

Update: 2020-04-28 13:49 GMT
Representational Image

ఆదివారం వచ్చిందంటే చాలు ఎవరి ఇంట్లో చూసినా చికెన్, మటన్ ఘుమఘమలు వస్తుంటాయి. ఎంత ధర ఉన్నా మాంసం ప్రియులు చికెన్ కాని, మటన్ కాని వారంలో ఒక్క రోజైనా తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు చికెన్ కు బాగా డిమాండ్ ఉన్నప్పటికీ, గతంలో జరిగిన కొన్ని ప్రచారాల కారణంగా చికెన్ విక్రయాలు క్రమంగా తగ్గాయి. దీంతో మటన్ విక్రయాలు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారస్తులు ఇదే అదునుగా చేసుకుని మటన్ ధరలను విచ్చలవిడిగా పెంచుతున్నారు. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతే కాక కొన్ని చోట్ల కల్తీ మాంసాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఇదంతా గమనించిన ప్రభుత్వం మటన్ షాపు యజమానులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే మటన్ ధరలను కూడా ఫిక్స్ చేసింది.

ఏ షాపులోనైనా మటర్ రూ.700లకే అమ్మాలని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా పట్టించుకోకుండా అధికధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ భేరి బాబు హెచ్చరించారు. ప్రతి షాపు ముందు మటర్ ధర కనిపించేలా బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మాంసం ధరలను నియంత్రించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం 11 మాంసం దుకాణాల్లో సోదాలు నిర్వహించి, లైసెన్స్‌ లేని దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. దుకాణాల చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలని నిర్దేశించారు. 


Tags:    

Similar News