అందుకే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Telangana Budget sessions 2025 : అందుకే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Minister Komatireddy Venkat Reddy: ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశం భారత్ కాగా.. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ సంఖ్య ఎక్కువగా ఉందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వెల్‌కే రోడ్లు వేసి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆ దుస్థితి దాపురించిందని ఆరోపించారు. ఆ ప్రాంతాల రోడ్ల నిర్మాణం కోసం కూడా సింగరేణి నిధులు ఉపయోగించారని అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో ప్రతీ గ్రామం నుండి మండలానికి డబుల్ రోడ్లు వేస్తామని తెలిపారు.
పంచాయతీ రాజ్ శాఖ 12 వేల కిమీ, ఆర్ అండ్ బి మరో 12 వేల కిమీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ ఏడాది 4000 కిమీ మేర రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి, మే జూన్ నాటికల్లా పనులు మొదలుపెట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 60 శాతం, కాంట్రాక్టర్లు 40 శాతం భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చేసిన ప్రతిపాదనలను మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి వారికి చెల్లించడానికి టోల్ గేట్స్ పెడతారా లేక మరే రూపంలో చెల్లిస్తారో చెప్పాల్సిందిగా ప్రభుత్వం నుండి వివరణ కోరారు. హరీశ్ రావు ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వేసే రోడ్లకు ఎలాంటి టోల్ టాక్స్ విధించం అని మంత్రి వెంకట్ రెడ్డి చెప్పారు.