కరెంట్ బిల్లుల గందరగోళంపై క్లారిటీ...

లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.

Update: 2020-06-08 12:58 GMT
minister jagadish reddy(file photo)

లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే ఆందోళనల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేసారు. కరెంటు బిల్లుల విషయంలో రాష్ట్రంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వినియోగదారులు ఎన్ని యూనిట్ల విద్యుత్తును వాడారో అన్ని యూనిట్లకు మాత్రమే బిల్లులు ఇచ్చామని ఆయన స్పష్టం చేసారు. 3 నెలల విద్యుత్‌ బిల్లు ఒక్కసారి ఇవ్వడం వల్లే బిల్లు ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తోందని, అంతే కాని ఒక్క రూపాయి కూడా అధికంగా వసూలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి ఏడాది సాధారణంగా వేసవిలో 35-40 శాతం వరకు విద్యుత్‌ వాడకం పెరుగుతుందని ఈ సారి ఇదే సమయంలో లాక్‌డౌన్‌ నెలకొన్న కారణంగా 10-15 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది భౌతిక దూరం పాటించాలనే నిబంధనను అనుసరించి రెండు నెలల పాటు రీడింగ్‌ తీయడానికి వెళ్లలేకపోయారని ఆయన స్పష్టం చేసారు. రీడింగ్‌ తీయక ముందే రెండు నెలలైనా, మూడు నెలలైనా సరాసరి బిల్లును తీసుకుంటామని ఇంతకుముందే చెప్పామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 90 రోజులకు, మరి కొన్ని చోట్ల 92 రోజులకు విద్యుత్‌ బిల్లులు తీశామన్నారు. గతేడాది బిల్లులు చెల్లించాలని ఈఆర్‌సీ నిర్దేశించిందని ఆ ఆదేశాల మేరకు విద్యుత్‌ సంస్థలు బిల్లులు పంపించాయని వివరించారు.


Tags:    

Similar News