Meerpet Tragedy: మీర్‌పేటలో హృదయవిదారక ఘటన.. 10 నెలల పసికందుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య.. షాక్‌తో అమ్మమ్మ కూడా ఆత్మహత్యాయత్నం

Meerpet Tragedy: మీర్‌పేటలో శుక్రవారం రాత్రి అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడికి లోనైన ఓ గృహిణి తన పది నెలల పసికందుకు విషమిచ్చి చంపి, అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2026-01-10 06:05 GMT

Suicide: మీర్‌పేటలో హృదయవిదారక ఘటన.. 10 నెలల పసికందుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య.. షాక్‌తో అమ్మమ్మ కూడా ఆత్మహత్యాయత్నం

మీర్‌పేటలో శుక్రవారం రాత్రి అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడికి లోనైన ఓ గృహిణి తన పది నెలల పసికందుకు విషమిచ్చి చంపి, అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన ఆమె తల్లి తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మీర్‌పేటకు చెందిన సుస్మిత (27)కు నాలుగేళ్ల క్రితం యశ్వంత్‌రెడ్డితో వివాహం జరిగింది. వీరికి అశ్వంత్ నందన్‌రెడ్డి అనే 10 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ ఫంక్షన్ కోసం షాపింగ్ నిమిత్తం సుస్మిత తల్లి లలిత (44) కూతురు ఇంటికి వచ్చింది.

శుక్రవారం తీవ్ర ఒత్తిడిలో ఉన్న సుస్మిత, మరో గదిలో తన కుమారుడికి విషమిచ్చి అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ గది నుంచి కూతురు బయటకు రాకపోవడంతో తల్లి లలిత లోపలికి వెళ్లి చూడగా.. కూతురు, మనవడు మృతి చెందిన దృశ్యం చూసి ఆమె తీవ్రంగా కుంగిపోయింది. ఆ షాక్‌ను తట్టుకోలేక ఆమె కూడా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన యశ్వంత్‌రెడ్డి, తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడి పరిస్థితి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురినీ సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుస్మిత, ఆమె కుమారుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లలిత ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

సుస్మిత కుటుంబ సభ్యులు.. కొంతకాలంగా భర్త వేధింపులు ఉన్నాయని, ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. అయితే లలిత కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News