Telangana: మౌలిక సదుపాయాలు కల్పించాలి: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన వనదేవతల జాతర వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం అయి సందడి చేయనుంది.

Update: 2020-01-26 12:13 GMT

తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన వనదేవతల జాతర వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం అయి సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సారి మేడారంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, సౌకర్యాలలో ఏలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని తెలిపారు. మేడారంలో జరిగే ఏర్పాట్లన ఎప్పటి కప్పుడు సందర్శిస్తానని, ఏర్పాట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు. దాని కోసం రెండు హెలికాప్టర్లు అందుబాటులోకి తెచ్చామని కేసీఆర్ వెల్లడించారు. ఈ హెలీకాప్టర్లు ఫిబ్రవరి 5వ తేది నుంచి 9వ తేది వరకు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ సమీక్షలో భాగంగానే పల్లె ప్రగతిలో జరిగిన పనుల గురించి అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో స్పందించిన కేసీఆర్ ఏ విధంగా అమలు అవుతుందో తెలుసుకునేందుకు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో 12,751 గ్రామాలు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకూ 12,705 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసామని తెలిపారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్నికూడా చేపడతామని దీంతో పట్టణాలు ఎంతో అభివృద్ది చెందుతాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కాలుష్యం పెరిగిపోతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్యంతో నిండిపోకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల దట్టమైన అడవులుగా తీర్చిదిద్దడం వల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరగకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇలాగే వివిధ నగరాల్లోనూ విరివిగా చెట్లు పెంచాలని చెప్పారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నిధుల్లో 10 శాతాన్ని మొక్కల పెంపకానికి వాడుకోవాలని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమిలో చెట్లు పెంచాలని ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలని సీఎం సూచించారు. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకు ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రులు సత్యవతి రాఠోడ్ ఆయనకు జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. 

Tags:    

Similar News