తెలంగాణ రాష్ట్రంలో రెండోదఫా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యిందా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి మరో 6గురికి కొత్తగా మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా.. 33 జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అదే సంఖ్యలో కీలక పదవులలో ఉన్న వారు అవసరం. దీంతో జూన్ 2లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని, అలాగే కీలకమైన నామినేటెడ్ పదవులు అన్ని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.
దీంతో ఈ నెలాఖరుకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆశావహులు భావిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరి చేరిక ఖాయమైంది. నూతన మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరికైనా స్థానం ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. అందులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సబితా ఇంద్రారెడ్డి, మరొకరు గండ్ర వెంకట రమణారెడ్డి. వీరిద్దరికి మంత్రిపదవులు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో 11 మంది మంత్రులే ఉన్నారు. మరో ఆరుగురు మంత్రులు కొత్తగా చేరే అవకాశం ఉంటుంది.