కవిత రాజీనామా సస్పెన్స్.. ఎమ్మెల్సీ రేసులో కాంగ్రెస్ నేతల కసరత్తులు
ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 20రోజుల క్రితం కవిత పంపిన రిజైన్‌కు మండలి ఛైర్మన్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుండగానే...
కవిత రాజీనామా సస్పెన్స్.. ఎమ్మెల్సీ రేసులో కాంగ్రెస్ నేతల కసరత్తులు
బీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకున్న కవిత.. ఆ పార్టీ సభ్యత్వంలో పాటు.. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. ఆమె రిజైన్ చేసి 20 రోజులు అవుతున్నా మండలి ఛైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై పునరాలోచన చేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి.. కవితకు సూచించారు. దీంతో కవిత నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం ఎటూ తేలక ముందే.. నిజామాబాద్‌లోని కాంగ్రెస్ నేతలు మాత్రం అప్పుడే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సిద్ధం అవుతున్నారు. సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ సైతం నెలకొంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పదవీ కాలం 2028 జనవరి నాలుగో తేదీ వరకూ ఉంది. ఇంకా రెండేళ్ల మూడు నెలల వరకూ పదవీ కాలం ఉన్న నేపథ్యంలో కవిత రాజీనామా ఆమోదం జరిగితే ఉప ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. 2022లో జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని బలం ఉండటంతో ఎవరూ పోటీ ఇవ్వలేకపోయారు. నిన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కవిత.. బీఆర్ఎస్‌లో ముఖ్యనేతలతో తలెత్తిన విభేదాల వల్ల పార్టీ నుంచి బయటకు వచ్చారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా గుడ్‌బై చెప్పారు. దీంతో ఆమె ఎన్నికైన ఎమ్మెల్సీ స్తానానికి ఇంకా రెండేళ్లకుపైగా పదవి కాలం ఉన్నందున ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహిస్తుందనే నమ్మకంతో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. ఒకవేళ బైపోల్ అనివార్యం అయితే.. కవిత పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు.
ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ నిర్ణయం ఏంటి అనేది పక్కన పెడితే..అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం అప్పుడే సన్నద్ధం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలాబలాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చాలా వరకూ బీజేపీ, కాంగ్రెస్‌లలో పార్టీలు మారిపోయారు. కవిత రాజీనామా ఆమోదం అయితే.. ఓ ఎమ్మెల్సీ స్థానం బీఆర్‌ఎస్ పార్టీ కోల్పోయినట్లు అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరాటం జరిగితే.. బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌లో..ఆశావహుల జాబితా ఒకింత పెద్దగానే ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేరు తెరమీదికి వచ్చింది. గతంలో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసిన షబ్బీర్ అలీకి చివరి నిమిషంలో మిస్సయింది. రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డి సిటు త్యాగం చేసీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సలహాదారులుగా ఉన్న మైనార్టీ నేత షబ్బీర్ అలీ.. ఖాళీ కానున్న కవిత స్థానం నుంచి బరిలో నిలుస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. షబ్బీర్ అలీతో పాటు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డిలతో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేదుకు ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐతే ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పదవుల్లో లేకపోవడంతో ముందుగా వీటికి ఎన్నికలు జరిగిన తర్వాతే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉండే అవకాశం కన్పిస్తుంది. కవిత రాజీనామాను ఆమోదిస్తే ఆరు నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ లో మాత్రం ఎమ్మెల్సీ కోసం ఎవరికి వారే ప్రయత్నం చేస్తున్నారు.