Warangal: కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ దందా

Warangal: కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2023-09-30 08:08 GMT

Warangal: కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ దందా

Warangal: వరంగల్‌లోని కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ దందా వెలుగులోకి వచ్చింది. నకిలీ స్థానిక ధ్రువపత్రాలతో కాళోజీ నారాయణ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు ఏడుగురు ఏపీ విద్యార్థులు. అనుమానం వచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం.. ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలను రద్దుచేసింది. ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యసాయి, ప్రీతికారెడ్డి, విష్ణుతేజ, సంజయ్‌, హనుమాన్‌రెడ్డి, మహేష్‌, యశ్వంత్‌ అడ్మిషన్స్‌ను రద్దు చేసింది. అలాగే.. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో సూత్రధారి కామిరెడ్డి నాగేశ్వరరావుపై మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ క్రమంలో ఏపీకి చెందిన ఈ ఏడుగురు విద్యార్థులు.. నకిలీ స్థానిక ధ్రువపత్రాలు సృష్టించి.. ఎంబీబీఎస్ సీట్లు పొందారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివినట్టు సర్టిఫికెట్లు పొందుపరిచారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. ఇలా చదివితే లోకల్ అభ్యర్థుల కింద సీటు పొందొచ్చు. దీంతో వీరంతా స్థానిక కోటాలో వర్సిటీలో సీట్లు పొందారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే రాయడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ధ్రువపత్రాలతో ప్రత్యక్షంగా వర్సిటీకి రావాలని విద్యార్థులను వివరణ కోరగా.. వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు.

విజయవాడలోని ఒక ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండా ధ్రువపత్రాలు పొందుపరిచారని అధికారులకు తెలిపారు. దీంతో ఈ ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన వర్సిటీ అధికారులు.. వీరి ప్రవేశాలను రద్దు చేశారు. సూత్రధారి నాగేశ్వరరావుతోపాటు ఏడుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News