హైదరాబాద్‌లో మూసీకి పోటెత్తిన వరద

Update: 2020-10-18 06:33 GMT

హైదరాబాద్ నగరాన్ని గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షం, వరదలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. హిమాయత్‌ సాగర్‌ గేట్లు తెరవడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చాదర్‌ఘాట్‌ నుండి మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రధాన రోడ్ పూర్తిగా బంద్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాదు ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో పాటు దానికి సమీపంలో ఉన్న బస్తీలను కూడా మూసీనది ముంచింది. దీంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వరదలకు సుమారు 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మూసీనది ఒక్కసారిగా ఇంతటి ఉగ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాయకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ వచ్చి తమని చూడలేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాతబస్తీ పూర్తిగా నీటమునిగింది. గుర్రం చెరువు తెగిపోవడంతో వరద నీరు పాతబస్తీని ముంచెత్తెంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక హిమాయత్‌ సాగర్‌ జల కళను సంతరించుకుంది. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. రాత్రి కురిసిన వర్షానికి నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 5 అడుగుల మేర 12 గేట్లను ఎత్తి వేశారు. అదే విధంగా గండి పేటకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో అధికారులు ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం ఉంది.

ఇక నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై నడుములోతున నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల ద్విచక్రవాహనాలు వరదలలో చిక్కుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం గ్రామంలో భారీ వర్షానికి చెరువు కట్ట తెగింది. దాంతో చెరువులోని నీరు అంతా గుంతపల్లి గ్రామంలోకి వచ్చింది. వరద తాకిడికి గుంతపల్లి గ్రామంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రోడ్డు తెగిపోయింది. రాత్రంతా గుంతపల్లి గ్రామం జలదిగ్భంధంలోనే ఉండిపోయింది. గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ రాత్రంత భయంతో గడిపారు. మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Tags:    

Similar News