Coronavirus: కరోనా సమయంలో మండిపోతున్న నిత్యవసరాల ధరలు

Coronavirus: ఆకాశాన్నంటుతున్న కూరగాయలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ రేట్లు

Update: 2021-06-18 14:30 GMT

కరోనా సమయంలో మండిపోతున్న నిత్యవసరాల ధరలు (ఫైల్ ఇమేజ్)

Coronavirus: కోవిడ్‌ పుణ్యమా అంటూ నిత్యవసర ధరలు మండిపోతున్నాయ్. కరోనా ముందు.. కరోనా తర్వాత అనే పరిస్థితులు దాపరించాయి. పెరిగిన ధరలతో సామాన్యుడి జేబులు ఖాళీ అవుతున్నాయి. పొద్దంతా కష్టం చేసి.. రాత్రికి కడుపు నిండా తిందామంటే కడుపు నిండని పరిస్థితి ఎదురవుతోంది.

ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన సామాన్యుడికి.. నిత్యవసర ధరలు కొత్త సవాల్‌ను విసురుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌, కూరగాయలు, పప్పుదినుసుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఏం తినాలో తెలియని పరిస్థితుల్లో కాలం గడుపుతున్నాడు పేదవాడు. లాక్‌డౌన్‌ కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఏం తీసుకుందామనుకున్నా కేజీకి వంద రూపాయలు ఖర్చు చేయాల్సిందే.

బీరకాయ కేజీ రూ.100

పశ్చిమిర్చి కేజీ రూ.100

చిక్కుడుకాయ కేజీ రూ.100

క్యాప్సికం కేజీ రూ.100

వరంగల్‌ అర్బన్‌ మార్కెట్‌లో కేజీ బీరకాయ వంద రూపాయలు, కేజీ పశ్చిమిర్చి వంద రూపాయలు, చిక్కుడుకాయ వంద రూపాయలు, క్యాప్సికం వంద రూపాయలు.. ఇలా.. ఏ కూరగాయ తీసుకున్నా.. కేజీ వందకు తగ్గడం లేదు. అంతో ఇంతో తక్కువగా బెండకాయ కేజీ 80 రూపాయలు, టమాటా కేజీ 50 రూపాయలు పలుకుతోంది. వందలు ఖర్చు పెట్టినా.. బ్యాగ్‌ నిండని పరిస్థితి. ఇక.. ఆకు కూరల గురించి చెప్పనవసరమేలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పౌష్టికాహారం ముఖ్యం కావడంతో.. పాలకూర, తోటకూర, చుక్కకూరల ధరలు బాగానే ఉన్నాయి.

కూరగాయల ధరలు భారీగా పెరిగిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బందితో పాటు.. కరోనా భయంతో ప్రజలెవరూ బయటకు రావడంలేదని, వచ్చినా కేజీ తీసుకునే దగ్గర అరకేజీతో సరిపెట్టుకుంటున్నారని అంటున్నారు. దీంతో గిరాకీ లేక తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా పెరిగిపోతున్న కూరగాయల ధరలతో.. ఏం చేయాలో తెలియక పచ్చడి మెతుకులతో సామాన్యుడు పొట్ట నింపుకుంటున్నాడు. ప్రభుత్వం స్పందించి.. ధరలు తగ్గించేలా చర్యలు చేపడితే బాగుంటుందని భావిస్తున్నాడు.

Tags:    

Similar News