ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
KCR: క్రమంగా కోలుకుంటోన్న కేసీఆర్ ఆరోగ్యం
ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయనను ఇవాళ డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్‌కు... సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డిశ్చార్జి అనంతరం బంజారాహిల్స్ నందినగర్‌లోని ఆయన నివాసానికి కేసీఆర్‌ను తీసుకెళ్లనున్నారు.
గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబసభ్యులు. మెడికల్ ఫాలో అప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్‌లోని ఇంట్లోనే ఆయన ఉండనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఈనెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది.