ఇంటర్ ఫెయిలయినందుకు ఆత్మహత్యలు!

Update: 2020-06-20 05:59 GMT

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో నలుగురు ఫెయిలై ఆత్మహత్య చేసుకోగా.. ఒక్కరు మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా గురువారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన సోని (16)కి ఇంటర్ ఫలితాల్లో 314 మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపంతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం సరయు (16) మూడు సబ్టెక్టుల్లో ఫెయిల్ అయింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె శుక్రవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్‌ తండాకు చెందిన విస్లావత్‌ హన్మంతు, సక్రిబాయిల కూతురు నిఖిత (18) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయింది. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన అగుళ్ల సాయిలు, మంగ దంపతుల కూతురు శ్రావణి (17) ఫెయిల్‌ అయినందుకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అలాగే గజ్వేల్ పట్టణానికి చెందిన బద్రీనాథ్(17) కూడా ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాడు. ఇది తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకుని సూసైడ్ చేసున్నాడు.

Tags:    

Similar News