ఘనంగా జరుగుతున్న ఏడుపాయల జాతర మహోత్సవాలు

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఏడుపాయల వనదుర్గాదేవి జాతర మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

Update: 2020-02-23 06:00 GMT

మెదక్‌‌‌‌ జిల్లా పాపన్నపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో జరిగే జాతరకు జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఏడుపాయల వనదుర్గాదేవి జాతర మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. చెట్లు, రాళ్లగుట్టలతో ఉండే అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జానపదుల జాతర జనరంజకంగా సాగుతోంది. డప్పువాయిద్యాల మోతలు, బోనాల ఊరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల జాతర ప్రాంగణమంతా హోరెత్తింది. అడుగడుగునా తెలంగాణ జానపదుల సంస్కృతి ఆవిషృతమైంది.

వనజాతరను తిలకించేందుకు వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. మూడ్రోజులు సెలవు దినాలు కలిసి రావడంతో అందరి చూపు ఏడుపాయలవైపు మళ్లింది. దీంతో ఆలయానికి వచ్చే దారులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణంలో ఎటుచూసినా భక్తజన సందోహమే కనిపించింది.

వనదుర్గాదేవి సన్నిదిలో ప్రవహిస్తున్న పవిత్ర మంజీర పాయల్లో పుణ్య స్నానాలను భక్తులు ఆచరించారు. సంతానం లేనివారు సంతానగుండంలో దంపతులు స్నానాలు ఆచరించి దుర్గాదేవి ఆలయంలో కొబ్బరికాయలు కట్టారు. కొందరు భక్తులు తలనీలాలను ఇచ్చి కొబ్బరికాయలను, తొట్టెలను కట్టారు. వివిధ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వైద్యం, శాంతి భద్రతల విషయంలో భక్తులకు విస్తృత సేవలందిస్తోంది.

Tags:    

Similar News