రోడ్డుపైనే ప్రసవం.. అక్కరకు రాని 108, అమ్మఒడి వాహనాలు !

Update: 2019-12-24 06:58 GMT
రోడ్డుపైనే ప్రసవం

క్షణాల్లో తరలివచ్చే వాహనాలు , నిమిషాల్లో ఆదుకునే సిబ్బంది, అత్యాధునిక వసతులతో కూడిన ఆసుపత్రులు ఇవేవి ఆ గర్భణికి అక్కరకు రాలేదు. రాకెట్ యుగంలోనూ స్పందించే వారు లేక నడిరోడ్డుపైనే ప్రసవం కావాల్సి వచ్చింది. ఎముకలు కొరకే చలిలో, చెట్ల మాటున ప్రసవించిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది.

మర్కోడు పంచాయతి కిచ్చనపల్లికి చెందిన మోకాళ్ల శిరిషకు నెలలు నిండటంతో పురిటినొప్పులు వచ్చాయి. ఆపద సమయం కావడంతో కుటుంబ సభ్యులు 108తో పాటు అమ్మఒడి వాహనాల కోసం ఫోన్ చేశారు. అయితే ఆళ్ళపల్లి రావాలంటూ 108 సిబ్బంది చెప్పడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గ మద్యలో నొప్పుల తీవ్రత పెరగడంతో అక్కడే రోడ్డు పక్కన పడుకోబెట్టి గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం సావిత్రికి సమాచారం ఇచ్చారు. ఎంతకి 108 రాకపోవడం పరిస్దితి విషమిస్తూ ఉండటంతో ఏఎన్ఏం సావిత్రి సాయంతో అక్కడే ప్రసవం నిర్వహించారు. అప్పటికి కూడా 108 రాకపోవడంతో ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి,బిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యంకోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్ధితులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. నిమిషాల్లో రావాల్సిన 108 వాహనాలు గంటలయిన రాకపోవడం, నడిరోడ్డుపై ప్రసవం జరిగినా కనీసం స్పందించకపోవడం పరిస్దితిని తెలియజేస్తున్నాయి.    

Tags:    

Similar News