Cold Wave: మన్యం జిల్లా దుప్పటిలా కప్పేసిన మంచు..చలి తీవ్రతతో వణికిపోతున్న ప్రజలు
మన్యం జిల్లా దుప్పటిలా కప్పేసిన మంచు చలి గాలుల ధాటికి వణికిపోతున్న ప్రజలు ఏజెన్సీ ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు పొగమంచు కమ్మడంతో స్తంభించిన జనజీవనం
Cold Wave: మన్యం జిల్లా దుప్పటిలా కప్పేసిన మంచు..చలి తీవ్రతతో వణికిపోతున్న ప్రజలు
మన్యంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి గాలుల ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతమంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభించింది. అల్లూరి జిల్లాలోని ముంచంగిపుట్టులో 6 డిగ్రీలు, జి.మాడుగులలో 5, పాడేరులో 6 , పెదబయలులో 7.5, డల్లపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పొగమంచులో ఘాట్ రోడ్లు పూర్తిగా తడిసిపోయాయి. పాడేరు సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి పొగమంచు దుప్పటి కప్పేసింది. ముఖ్యంగా ఘాట్ రోడ్లలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. హుకుంపేట మండలంలో కూడా ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటంలేదు. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలవుతుండటంతో, గ్రామాలలోని ప్రతి వీధిలోనూ ప్రజలు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు...
చలికాలంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో శ్వాసకోశ, ఆస్తమా, జలుబు, వైరల్ ఫీవర్, వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నయని వైద్యులు సూచిస్తున్నారు. చలి ఎక్కువ ఉన్నప్పుడు వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు. దుప్పట్లు, చలికోట్లు వంటివి ధరించాలని కోరారు. చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని అన్నారు. శ్వాసకు సంబంధించిన యోగా, వాకింగ్ వంటివి చేయాలని డాక్టర్లు తెలిపారు. శ్వాసకోశ, ఆస్తమాతో పాటు చలిలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు...