తెలంగాణలో పోటీకి సిద్ధమైన సీపీఎం.. 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటన
CPM: పొత్తులపై ఎటు తెల్చకపోవడంతో పోటీకి సిద్ధమైన సీపీఎం
తెలంగాణలో పోటీకి సిద్ధమైన సీపీఎం.. 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటన
CPM: తెలంగాణలో తన బలాబలాలను తేల్చుకోవడానికి సీపీఎం సిద్ధమైంది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని వేచిచూసిన సీపీఎం.. సీట్ల కేటాయింపు విషయమై ఆ పార్టీ ఎటూ తేల్చకపోవడంతో 17 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం 14 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. తాజాగా రెండో జాబితాలో మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానంపై స్పష్టత రావాల్సి ఉన్నది.
నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్ నుంచి మల్లు లక్ష్మి, నల్లగొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డికి టికెట్లు కేటాయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పాలేరును బరిలోకి దిగుతున్న ఆయన.. నేడు నామినేషన్ వేయనున్నారు. కాగా, సీఎంపీ పోటీచేస్తున్న 16 నియోజకవర్గాలు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున ఉండగా మిగిలినవి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి.
కాంగ్రెస్‌తో పొత్తులు ఉంటాయని భావించిన సీపీఎంకు షాక్ తగిలింది. పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. మరోవైపు సీపీఐ, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తుంది. సీపీఐ పోటీ చేస్తున్న కొత్తగూడెంలో మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీజేపీ వ్యతిరేకంగా తమ కార్యచరణ ఉంటుందని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేయనుంది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి కేటాయిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ హామీ ఇచ్చారు .కాంగ్రెస్-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సీపీఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారితో కూడా పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.