మద్యం దుకాణాల లైసెన్సుల ప్రక్రియ ప్రారంభం.. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ

Liquor Shop License: ఈనెల 18వరకూ దరఖాస్తులకు గడువు

Update: 2023-08-04 05:57 GMT

మద్యం దుకాణాల లైసెన్సుల ప్రక్రియ ప్రారంభం.. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ 

Liquor Shop License: రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం గురువారం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేల 620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతుంది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రెండు లక్షలుగా, స్పెషల్‌ రీటెయిల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను అయిదు లక్షలుగా నిర్ధారించారు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్‌ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్‌ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్‌ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి లైసెన్సులు జారీచేస్తారు. వార్షిక ఆర్‌ఎస్‌ఈటీ ఆరు సమానా వాయిదాల్లో చెల్లించవచ్చు. మొత్తం ఆర్‌ఎస్‌ఈటీలో 25 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలను అనుమతిస్తారు. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసువారు, ఎక్సైజ్‌ చట్టం ప్రకారం శిక్ష పడినవారు, గతంలో ఎక్సైజ్‌ రెవెన్యూ ఎగ్గొట్టిన వారు, కోర్టు ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించినవారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.

మొత్తం మద్యం దుకాణాలు- 2620 ఉన్నాయి. ఓపెన్‌ క్యాటగిరీ షాపులు- 1834, మొత్తం రిజర్వుడ్‌ షాప్‌లు- 786 కేటాయించారు. వాటిలో గౌడలకు- 393, ఎస్సీలు- 262 , షెడ్యూల్డ్‌ ఏరియా ఎస్టీలకు- 95, నాన్‌ షెడ్యూల్డ్‌ ఎస్టీలకు- 36 చొప్పున కేటాయిస్తారు. దరఖాస్తుల తుది గడువు ఈనెల18 తో ముగుస్తుంది, లైసెన్సుల జారీ కోసం ఈనెల 21న లాటరీ తీస్తారు. కొత్తషాపులకు నబంబర్ 30న స్టాక్ విడుదల చేస్తారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి షాపులు ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News