తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ.. బస్సులు, మెట్రో బంద్ : సీఎం కేసీఆర్

Update: 2020-03-21 10:30 GMT

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఆదివారంనాడు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రోజున తెలంగాణ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా నివారణను నివారించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 24గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని పిలుపునిచ్చారు. శనివారం ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ''రేపు ఉదయం 6గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6గంటల వరకు స్వీయ నిర్బంధంలో ఉందాం. ఆర్టీసీ బస్సులు నడపం. ఇతర రాష్ట్రాల బస్సులు కూడా రావొద్దని చెబుతున్నాం. ఇతర రాష్ట్రాల బస్సుల్ని 24గంటల పాటు రాష్ట్రంలోకి రానివ్వం. శనివారం మెట్రో రైలు సేవలు కూడా నిలిపివేస్తున్నాం'' అని కేసీఆర్‌ తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న సీఎం కేసీఆర్ తెలంగాణలో ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యులను కలవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రావడానికి నిరాకరిస్తే ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, పది సంవత్సరాల వయసు లోపు ఉన్నవారు రెండు వారాల పాటు బయటకు రావొద్దని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో అవసరమైతే టోటల్ షట్ డౌన్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బోర్డర్లు కూడా మూసేస్తామన్నారు. పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు కూడా ఇంటికి పంపిణీ చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News