చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నల్లమల కనుమరుగు కాబోతుందా.?

Update: 2019-07-13 07:05 GMT

చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నల్లమల కనుమరుగు కాబోతుందా.? నల్లమలో దాగిఉన్న అపార ఖనిజ సంపద దక్కకుండా పోతుందా...?బహుళజాతి కంపెనీల ప్రయత్నాలు చూస్తుంటే ఇది నిజం కాబోతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇందుకు అడవిపుత్రులు అంగీకరిస్తారా...? నల్లమల చెంచులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

"పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర" పాటను నిజం చేసే విధంగా బహుళజాతి కంపెనీల రక్కసికి ప్రతి పల్లె తల్లడిల్లిపోతుంది. దట్టమైన కొండలు..కోనలతో విస్తరించిన నల్లమల అడవుల భవిత ప్రశ్నార్థం కాబోతుంది. అడవిపుత్రుల బతుకు చిద్రం కానుంది. మహబూబ్ నగర్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతం త్వరలోనే పెద్ద పెద్ద యంత్రాల మోతలతో తవ్వకాలతో రూపురేకలు మారబోతున్నాయి.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో యురేనియం నిక్షేపాలపై బహుళజాతి కంపెనీలు కన్నేశాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో యురేనియం నిల్వల కోసం అన్వేషణ దిశంగా కేంద్రం అడుగులు వేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలోనే ఇక్కడ యూరేనియం తవ్వకాల కోసం ప్రయత్నాలు జరిపిన సమయంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. తవ్వకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొన్నేళ్లుగా స్తబ్దంగా ఉన్న యూరేనియం అలజడి మళ్లీ తెరపైకి రావడంతో నల్లమల అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తం అయ్యారు. మరో సారి యురేనియం తొవ్వకాలపై పోరాటానికి సిద్దమౌతున్నారు.

నల్లమలలో అపారమైన వృక్ష సంపద..అడవి జంతువులు, పులులు ఇతర కృరమృగాలకు నెలవుగా ఉంటుంది. అంతే కాదు అడవి మధ్యలో కృష్ణమ్మ పరవళ్లు శ్రీశైలం పుణ్యక్షేత్రం ఈ అడవి అందాలకు వన్నెతెస్తుంది. దాదాపు 430 ఆవాసాలలో చెంచులు నివాసం ఉంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న నల్లమల అటవీ ప్రాంతంలో ఖనిజాలతో వజ్రాలు కూడా ఉన్నాయన్నది యాదార్థం. ఎలాగైన ఇక్కడి ఖనిజ సంపదను కొల్లగొట్టాలనుకున్నాయి బహుళజాతీ సంస్థలు.

అడవిబిడ్డల ఆందోళనతో తవ్వకాలపై వెనక్కితగ్గారని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరోసారి యూరేనియం తవ్వకాలు తెరపైకి తేవడంతో నల్లమల అటవీప్రాంత వాసులు చెంచులు మళ్లీ ఉలిక్కిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాలను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు. చెంచుల ఆందోళనకు అప్పట్లో కలిసి వచ్చిన రాజకీయ పార్టీలు అండగా నిలిచి బహుళజాతి కంపెనీల ప్రయత్నాలు తిప్పికొట్టాలని నల్లమల ప్రాంత వాసులు కోరుతున్నారు.   

Full View

Tags:    

Similar News