Telangana Assembly Elections 2023: నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకరణ

Telangana Assembly Elections 2023: ఈనెల 10న నామినేషన్ స్వీకరణకు చివరి గడువు

Update: 2023-11-03 02:50 GMT

Telangana Assembly Elections 2023: నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకరణ

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈనెల 10వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండనుంది. ప్రతీ రోజు ఉదయం 1గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. ఈనెల 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఈసీ. నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులకు 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5వేలు డిపాజిట్ చేయాల్సింది ఈసీ తెలిపింది. ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ర్యాలీలు, సభలను ఈసీ నిషేధం విధించింది. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇక నుంచి అభ్యర్థి ఖర్చును లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు.

తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం మరోసారి దృష్టి సారించింది. నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర యంత్రాంగం పనితీరును సమీక్షించింది. అధికారులను తగు విధంగా సర్వసన్నద్ధం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించి..తాజా స్థితిగతులపై ఆరా తీసింది. ప్రలోభాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, తనిఖీలు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష జరిపింది. 22 ఏజెన్సీల పని తీరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అధికారులకు పలు సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల బృందం. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, మరో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ కుమార్ వ్యాస్ నేతృత్వంలోని అధికారుల బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు.. ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను వారికి వివరించారు. మరోవైపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ సీఎస్, డీజీపీ, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమీక్షలో సీఎస్ శాంతికుమారి, సీఈవో వికాస్ రాజ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ జరిగే రోజు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్‌ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కేంద్ర బృందానికి సీఎస్‌ శాంతికుమారి వివరించారు. ఇప్పటికే సరిహధ్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో నిఘా పెంచామని.. ఫలితంగా ఇప్పటివరకు 385 కోట్ల రూపాయల మేర నగదు జప్తు చేసినట్లు చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 17 జిల్లాల్లో 166 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలతో సమర్థమైన సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించినట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News