తెలంగాణలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌..ముగ్గురు బడా లీడర్లకు కాషాయ తీర్థం..?

Update: 2019-07-30 10:59 GMT

కర్ణాటకను కాషాయీకరణ చేశారు.. ప్రస్తుతానికి దక్షిణాదిలో బీజేపీకి అవకాశం ఉన్ణ ఏకైక రాష్ట్రం తెలంగాణపై కూడా వ్యూహాలు అమలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారీ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అసంతృప్తులే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌ చేపట్టిన కమలదళం త్వరలోనే భారీ చేరికలుంటాయని తేల్చిచెబుతోంది.

కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా కర్ణాటక తర్వాత అధికారానికి అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రమైన తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు కమల తీర్థం పుచ్చుకోగా త్వరలోనే భారీ చేరికలుంటాయని చెబుతున్నారు.

ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకోవడం బలమైన నాయకులను చేర్చుకోవడం, అధికార పార్టీని ఎదుర్కోవడం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగస్టు రెండో వారంలో మరోసారి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని ఆశిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్ళు కాషాయం కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి చేరికలు తగ్గినా ఈ సారి ముగ్గురు పెద్ద నాయకులే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది. ఇటీవల అమిత్ షా ను కలిసిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ అమిత్ షా టూర్ సందర్భంగా పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. 

Tags:    

Similar News