Amarnath Yatra: జూన్‌ 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Amarnath Yatra: భారీసంఖ్యలో దర్శించుకోనున్న భక్తులు

Update: 2024-04-15 09:39 GMT

Amarnath Yatra: జూన్‌ 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Amarnath Yatra: హర మహాదేవ శంభో శంకరా అంటూ హిమాలయాల్లో మారుమ్రోగే అరుదైన యాత్రకు రంగం సిద్ధమైంది. అమర్ నాథ్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు అమర్ నాథ్ ఆలయ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర కోసం ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభం కానున్నాయి. మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

అమర్‌నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధమైన శివ లింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో భూమికి 3880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ ఆలయం ఉంది.

అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్ బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది. అయితే, 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి. ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లకూడదు. అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీన అష్టమి తిథి మధ్యాహ్నం 02.19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇక, ఆగస్టు 19తో ఈ యాత్ర ముగియనుంది. కాగా, ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అమర్ నాథ్ యాత్ర కొనసాగుతుంది కాబట్టి ఆరోగ్య సక్రమంగా ఉన్నవారు మాత్రమే రావాలని అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News