అమెరికాలో ఇక నో టిక్‌టాక్, ట్రంప్‌పైనే ఆ కంపెనీ ఆశలు.. నిషేధం ఎందుకంటే...
Ban on TikTok app in US: అమెరికాలో ఇక నో టిక్‌టాక్... ట్రంప్‌పైనే ఆ కంపెనీ ఆశలు
Ban on TikTok app in US: అమెరికాలో టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి. శనివారం అర్థరాత్రి కంటే ముందే అమెరికాలో టిక్ టాక్ సేవలను ఆ కంపెనీ ఆపేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఆఖరికి కొత్తగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి కూడా యాపిల్ స్టోర్, గూగుల్ ప్లేలోనూ టిక్ టాక్ యాప్ అందుబాటులో లేదు. ఇవాళ ఆదివారం నుండే అమెరికా టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం రాత్రి నుండే అమెరికాలో ఈ యాప్ అదృశ్యమైంది.
ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ యాప్ వినియోగిస్తున్న వారి సంఖ్య 170 మిలియన్లకుపైనే ఉన్నట్లు రాయిటర్స్ కథనం చెబుతోంది. అంటే 17 కోట్ల మందికిపైగా అమెరికన్స్ టిక్ టాక్ యాప్ యూజ్ చేస్తున్నారన్నమాట.
అమెరికా యూజర్స్‌కు టిక్ టాక్ ఏం చెప్పిందంటే..
శనివారం రాత్రి 10.45 తరువాత నుండి అమెరికాలో టిక్ టాక్ పనిచేయడం లేదు. ఎవరైనా యూజర్స్ టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే ఆ యూజర్స్‌కు కంపెనీ ఒక మెసేజ్ చూపిస్తోంది. అదేంటంటే... "ఆదివారం నుండి అమెరికాలో టికా టాక్ యాప్ అందుబాటులో ఉండదు. కానీ సోమవారం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనల్డ్ ట్రంప్ ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామన్నారు. ట్రంప్ రాకతో మళ్లీ అమెరికాలో టిక్‌టాక్ యాప్‌పై ఆంక్షలుఎత్తివేస్తారని ఆశిస్తున్నాం. అప్పటివరకు వేచిచూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం" అని టిక్‌టాక్ చెబుతోంది.
టిక్‌టాక్ యాప్‌పై అమెరికా ఎందుకు నిషేధం విధించింది?
టిక్‌టాక్ యాప్ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ అనే కంపెనీకి చెందిన యాప్. గత కొంతకాలంగా చైనాతో అమెరికాకు పడటం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్యం, విధానపరమైన నిర్ణయాల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. పైగా చైనా అమెరికా ఖాజానా విభాగం డాక్యుమెంట్స్ హ్యాక్ చేసినట్లు జో బైడెన్ సర్కార్ ఆరోపిస్తోంది. దీంతో చైనాకు చెందిన టిక్ టాక్ యాప్‌తోనూ అమెరికా జాతి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని అమెరికా వాదిస్తోంది.
అంతేకాకుండా అమెరికాలో సగానికిపైగా జనం టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు చైనా ఏదైనా సైబర్ ఎటాక్ చేస్తే అమెరికన్ పరిస్థితి ఏంటనేది అక్కడి సర్కారు వాదన. అందుకే అమెరికాలో టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అది జో బైడెన్ ప్రభుత్వానికి, ఆయన పదవీ కాలానికి ఆఖరి రోజు అయినటువంటి జనవరి 19 నుండే ఆ నిషేధం అమలులోకి రానుంది. ఇంకా చెప్పాలంటే ఆ నిషేధం ఈరోజు నుండే అమలుకానుంది. అందుకే నిషేధం అమలులోకి రావడానికంటే సరిగ్గా ఒక గంట ముందు నుండే బైట్ డ్యాన్స్ కంపెనీ అమెరికాలో టిక్ టాక్ సేవలను నిలిపేసింది.