Data Leak : రూ.99లకే మార్కెట్లో మీ పర్సనల్ వివరాలు..టెలిగ్రామ్ బాట్‌తో జాగ్రత్త!
చాలా యాప్‌లు 'మా దగ్గర మీ సమాచారం సేఫ్, మీ ప్రైవసీకి గ్యారెంటీ' అని పెద్ద పెద్ద మాటలు చెబుతాయి. కానీ అవన్నీ నిజమా?
Data Leak : రూ.99లకే మార్కెట్లో మీ పర్సనల్ వివరాలు..టెలిగ్రామ్ బాట్‌తో జాగ్రత్త!
Data Leak : చాలా యాప్‌లు 'మా దగ్గర మీ సమాచారం సేఫ్, మీ ప్రైవసీకి గ్యారెంటీ' అని పెద్ద పెద్ద మాటలు చెబుతాయి. కానీ అవన్నీ నిజమా? మన భద్రత కోసం టూ-స్టెప్ వెరిఫికేషన్ లాంటి ఫీచర్లు ఇస్తారు. అవి ఆన్ చేసుకుంటే మనం డిజిటల్ ప్రపంచంలో సేఫ్‌గా ఉన్నట్టేనా? అవునని అనుకుంటే పొరపాటే. ఇప్పుడే వచ్చిన ఈ కొత్త రిపోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ రిపోర్ట్ డేటా లీక్ గురించి ఒక షాకింగ్ నిజం బయటపెట్టింది. టెలిగ్రామ్ బాట్ ఒకటి ప్రజల పర్సనల్ వివరాలను మార్కెట్లో అమ్మేస్తోందట. ఇది విన్నాక, యాప్‌లు వాడే వాళ్ల ప్రైవసీ గురించి చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు మనం వాడుతున్న యాప్‌ల దగ్గర మన డేటా నిజంగానే సురక్షితంగా ఉందా లేదా అని ఆలోచింపజేస్తోంది ఈ రిపోర్ట్.
'డిజిట్' అనే సంస్థ ఈ టెలిగ్రామ్ బాట్ గురించి బయటపెట్టింది. ఆ బాట్ పేరును రిపోర్ట్‌లో చెప్పలేదు కానీ.. ఒక టిప్ ద్వారా వారికి ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. టెలిగ్రామ్‌లో బాట్ అనేది ఒక ముఖ్యమైన ఫీచర్. దీన్ని ఎవరైనా తయారు చేయొచ్చు. ఈ బాట్స్‌ను రకరకాల పనుల కోసం ఉపయోగిస్తారు.
రిపోర్ట్ ప్రకారం, టెలిగ్రామ్‌లో ఒక బాట్ ఉందట అది భారతదేశ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కొనుగోలుదారులకు అమ్మేస్తోందట. ఈ బాట్ యూజర్ల పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఓటర్ ఐడీ నంబర్ వంటి వివరాలను లీక్ చేస్తోందట. ఈ కీలక వివరాలను ఇవ్వడానికి ముందు, ఆ బాట్ ఒక ప్లాన్ కొనుగోలు చేయమని అడుగుతుందట. ఆ ప్లాన్ ధరలు రూ.99 నుంచి రూ.4999 వరకు ఉన్నాయని తెలుస్తోంది.
ఒకసారి మీరు ప్లాన్ కొన్నారంటే, ఆ బాట్ మీ 10 అంకెల మొబైల్ నంబర్ పంపమని అడుగుతుందట. ఆ తర్వాత కేవలం రెండు సెకన్లలోనే, ఆ మొబైల్ నంబర్‌కు సంబంధించిన వ్యక్తి పూర్తి ప్రొఫైల్‌ను ఇచ్చేస్తుందట. ఇందులో మీ పేరు, వేరే ఫోన్ నంబర్లు, అడ్రస్, మీ ముఖ్యమైన డాక్యుమెంట్ల వివరాలు అన్నీ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మన పర్సనల్ వివరాలు ఇలా రూ.99కే అమ్ముడుపోవడం అంటే మన ప్రైవసీకి అసలు విలువ లేకుండా పోతున్నట్లే. టెలిగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఈ బాట్స్‌ను ఎలా నియంత్రిస్తున్నాయనేది పెద్ద ప్రశ్న.