Free VoWiFi calling: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలు

BSNL Free WiFi calling: జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.

Update: 2026-01-01 14:59 GMT

Free VoWiFi calling: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలు

Free WiFi calling: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ సేవలు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉంటాయి.

మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉండే బేస్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాల లోపలి భాగాలు, అలాగే మారుమూల ప్రాంతాల్లో స్పష్టమైన వాయిస్ కాల్స్ అందించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యంగా BSNL పేర్కొంది. వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి, తమ ఫోన్‌లోని సాధారణ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా టెలికాం నెట్‌వర్క్‌ను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగానే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా సరైన టెలికాం సేవలు అందని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపడుతుందని పేర్కొంది.

ఈ సేవలను వినియోగించుకోవాలంటే వైఫై కాలింగ్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండటం సరిపోతుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘వైఫై కాలింగ్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఈ కొత్త సేవతో బీఎస్ఎన్ఎల్ కూడా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థల సరసన చేరినట్టయింది.

Tags:    

Similar News