U19 Asia Cup 2024: 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ వీరవిహారం.. ఆసియా కప్‌ ఫైనల్లో భారత్..!

U19 Asia Cup 2024: అండర్-19 ఆసియా కప్‌ 2024లో యువ భారత్ అదరగొడుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది.

Update: 2024-12-06 12:35 GMT

U19 Asia Cup 2024: 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ వీరవిహారం.. ఆసియా కప్‌ ఫైనల్లో భారత్..!

U19 Asia Cup 2024: అండర్-19 ఆసియా కప్‌ 2024లో యువ భారత్ అదరగొడుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 21.4 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67; 36 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. ఆయుష్‌ మాత్రే (34; 28 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సూర్యవంశీకి దక్కింది. ఇక ఆదివారం దుబాయ్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో బంగ్లాదేశ్ జట్టుతో భారత్‌ తలపడనుంది.

సెమీస్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. 8 పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. దుల్నిత్ సిగెరా (2), పులిందు పెరీరా (6), విమత్ దిన్సారా (0) నిరాశపరిచారు. ఈ సమయంలో లక్విన్ అబెయ్‌సింఘే (69; 110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), షారుజన్ షణ్ముగనాథన్ (42; 78 బంతుల్లో 2 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నిర్మించాక అవుట్ అయ్యారు. అనంతరం కవిజ గమగే (10), విహాస్ థెవ్మిక (14)లు పరుగులు చేయడంతో మోస్తరు స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్లలో చేతన్‌ శర్మ 3 వికెట్లు, కిరణ్‌ చొర్మాలే 2, ఆయుష్‌ మాత్రే 2 వికెట్లు తీశారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్‌ మాత్రే చెలరేగారు. ముఖ్యంగా 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ రెచ్చిపోయాడు. సిగెరా వేసిన రెండో ఓవర్లో మూడు సిక్సులు, ఓ ఫోర్ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సూర్యవంశీ 24 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. మరోవైపు ఆయుష్‌ మాత్రే కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇద్దరు కలిసి 8 ఓవర్లలో 91 రన్స్ నమోదు చేశారు. అనంతరం ఆంద్రీ సిద్ధార్థ్‌ (22), మహ్మద్ అమన్ (25 నాటౌట్), కార్తికేయ (11 నాటౌట్) రన్స్ చేశారు. లంక బౌలర్లలో విహాస్, చముదిత, మనీషా తలో వికెట్ తీశారు. సెమీస్‌ 1లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Tags:    

Similar News